ఓ చిన్న పిల్లాడు ఇచ్చిన సమాచారంతో మూడు జిల్లాల పోలీసులు వెతుకుతున్న అంతర్రాష్ట్ర నేరగాడిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో దొంగను అరెస్టు చేశారు.
ఏం జరిగింది:
జిల్లాలోని మంగళదాస్‌నగర్‌లో నివాసం ఉండే పసుపులేటి సీతారావమ్మ ఈ నెల 5న ఉదయం పూట తలుపు గడియపెట్టకుండా సమీపంలో ఉన్న షాపు వద్దకు పాలప్యాకెట్ కోసం వెళ్లారు. వచ్చేసరికి ఇంట్లో ఉన్న విలువైన టీవీ, కొంత నగదు, బంగారం దొంగలెత్తుకెళ్లారు. పాతగుంటూరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. క్లూస్ టీం బృందాలు అక్కడికి చేరుకుని.. చోరీ జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు సేకరించారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలీసుల గాలింపు:
వేలిముద్రలను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసి పరిశీలిస్తే అవి పాత నేరస్థుడివిగా గుర్తించారు. గతంలో నెల్లూరు, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పలు స్టేషన్ల పరిధిలో ఈ నేరస్థుడిపై కేసులు నమోదైనట్లు వెల్లడి కావటంతో వెంటనే అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి.. నెల్లూరుకు ఒక బృందాన్ని పంపారు. ఆ జిల్లాలో వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో నిందితుడు ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. బంధువుల నుంచి నేరగాడి చరవాణి నంబరు సంపాదించారు. మొబైల్ సిగ్నళ్ల ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి గుంటూరులోనే ఉన్నాడని తెలుసుకుని ఆరా తీయటం ప్రారంభించారు. మంగళగిరి మండలం చినకాకాని పరిసరాల్లో ఉన్నట్లు కనుక్కొని.. అక్కడకు సీసీఎస్ బృందం చేరుకుంది. గ్రామాన్ని మొత్తం జల్లెడ పట్టినా.. ఆచూకీ దొరకలేదు.
ఇలా ఎరవేశారు..
పోలీసులు చినకాకానిలో ఎంతమందిని విచారించినా ఆచూకీ దొరకకపోవడంతో చివరి అస్త్రంగా తమ వద్ద ఉన్న నేరగాడి ఫొటోను ఉపయోగించారు. ఆ ఊళ్లో ఉండే పిల్లలకు ఫోటో చూపించి.. వివరాలు చెబితే రూ.50, ఫైవ్‌స్టార్ చాక్లెట్ ఇస్తామని ఆశచూపారు. ఓ పిల్లాడు ఫొటోలో వ్యక్తి పక్కనే ఉన్న నగరంపాలెంలోని ఓ నివాసంలో ఉన్నట్లు చెప్పి నేరుగా పోలీసులను ఆ ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంటిలో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారు అక్కడ ఓ శిథిలావస్థలో ఉన్న ఇంటిని తాత్కాలికంగా అద్దెకు తీసుకుని తలదాచుకుని చోరీ చేసిన సొత్తుతో తిరిగి స్వగ్రామానికి ఎలా చేరుకోవాలో ప్రణాళిక రచించుకుంటున్న తరుణంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు చోరీలకు పాల్పడటంలో ఈ దొంగల ముఠాకు నేతృత్వం వహిస్తున్న కిరణ్‌కు మంచి ప్రావీణ్యం ఉన్నట్లు అతని నేరచరిత్ర ఆధారంగా తెలుస్తోంది. కిరణ్‌పై ఒంగోలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో పలు చోరీ కేసులు ఉండటంతో ప్రస్తుతం ఆయా జిల్లాల పోలీసులు అతని కోసం గాలిస్తుండగా గుంటూరు అర్బన్ పోలీసులకు చిక్కడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కిడ్నాప్ కేసు.. చర్చనీయాంశంగా గుంటూరు శ్రీను వ్యవహారం