Incentives for Industries in Andhra Pradesh: పారిశ్రామిక వేత్తలకు ఫోన్‌కాల్ దూరంలో ఉంటాను అని చెప్పిన సీఎం జగన్ (CM YS Jagan) మాటలే నిజమైతే..! ఫాక్స్‌కాన్ పొరుగు రాష్ట్రానికి ఎందుకు వెళ్తుంది. అమరరాజా బ్యాటరీస్..(Amara Raja Energy and Mobility Ltd) సొంత గడ్డను కాదనుకుని వ్యాపార విస్తరణకు తెలంగాణను.. ఎందుకు ఎంచుకుంది.? పారిశ్రామిక వేత్తలను చెయ్యిపట్టుకుని నడిపిస్తున్నట్లు.. భ్రమకల్పించే జగన్ మొదలుకుని.. వైసీపీ ప్రభుత్వంలో.. ఏ ఒక్కరి వద్దా సమాధానం ఉండదు! జగన్ ప్రత్యేక పారిశ్రామిక విధానం గొప్పతనం అలాంటిది.! ‘తనవారికి అందలం, వ్యతిరేకించే వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే.. జగన్ మార్క్ పారిశ్రామిక విధానం.
వైసీపీ అధికారంలోకి రాగానే.. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు కేటాయించిన భూముల సమీక్ష పేరుతో.. కక్షపూరిత చర్యలకు దిగింది. రాష్ట్రం వదిలిపోయే వరకూ వెంటపడింది. ఉన్న పరిశ్రమలనూ రకరకాల తనిఖీల పేరుతో వేధించింది. అవి తట్టుకోలేకే.. అమరరాజా బ్యాటరీస్, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ విస్తరణ ప్రాజెక్టులకు.. పొరుగు రాష్ట్రాలను ఎంచుకున్నాయి. పారిశ్రామిక ప్రోత్సాహాలు ప్రకటనల్లో తప్ప.. అమల్లో కానరాకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.
కొవిడ్ లాక్‌డౌన్... తర్వాత వైసీపీ ప్రభుత్వం 1109 కోట్ల రూపాయలతో.. రీస్టార్ట్’ ప్యాకేజీ ప్రకటించింది. పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, విద్యుత్ ఫిక్స్‌డ్ డిమాండ్ ఛార్జీల మినహాయింపుతో పాటు.. వర్కింగ్ క్యాపిటల్ రుణాల మంజూరుకు ప్రత్యేక నిధి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో చిన్న పరిశ్రమలకు.. ప్రోత్సాహకాల కింద 904 కోట్లు ఇచ్చారు. మూడేళ్లు గడిచినా మిగతా హామీలకు దిక్కూమొక్కూ లేదు.
2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి.. విద్యుత్ సంస్థలకు పరిశ్రమలు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ డిమాండ్ ఛార్జీలు 205 కోట్ల రూపాయలను భరిస్తామని ప్రభుత్వం చెప్పింది. విద్యుత్ సంస్థలు మాత్రం ప్రతి నెలా బిల్లులో కలిపి.. పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు వసూలు చేశాయి.
ప్రభుత్వం ఇప్పటిదాకా.. ఆయా యాజమాన్యాలకు తిరిగి ఇవ్వలేదు. ఇక చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుకు రూ.2 లక్షల నుంచి 10 లక్షలు రుణంగా అందించడానికి.. రూ.200 కోట్లతో వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ సమకూర్చుతామని చెప్పింది. మూడేళ్ల మారటోరియం విధిస్తామని చెప్పి.. పైసా ఇవ్వలేదు. పరిశ్రమలు కష్టాల్లో ఉన్నప్పుడు..చేయూత అందించేందుకు వీలుగా ‘పారిశ్రామిక ఆధార్’ పేరిట విశిష్ట సంఖ్య కేటాయించేందుకు చేపట్టిన.. ప్రత్యేక కార్యక్రమమూ అర్ధాంతరంగా ఆగిపోయింది.
Ferro Alloy Industries: ప్రభుత్వ స్పందన కరవు.. మూసివేతకు సిద్ధమైన 39 ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు
చిన్న పరిశ్రమలపై సర్కార్‌ది చిన్నచూపే: ఇక చిన్న పరిశ్రమలపైనా.. వైసీపీ సర్కార్‌ది చిన్నచూపే.! పారిశ్రామిక రంగాన్ని తానే ఉద్ధరిస్తున్నట్లు 2022లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన జగన్.. నాలుగున్నరేళ్లలో ప్రోత్సాహకాల కింద చెల్లించింది 1,570 కోట్లే..! 2022, 2023 జులైలో ప్రోత్సాహకాల కింద చెల్లించాల్సిన.. సుమారు రూ.2,400 కోట్లను చెల్లించలేదు. ఇలాగైతే.. పరిశ్రమలు ఎలా నిలదొక్కుకుంటాయనేది అనుమానమే. ఇక కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల ప్రోత్సాహకానికి యూనిట్‌కు రూ.1.50 పైసల వంతున రాయితీ ఇస్తామని పారిశ్రామిక విధానంలో చెప్పిన ప్రభుత్వం అందులో రెండొంతులు విద్యుత్ సుంకం పెంచడం ద్వారా.. లాగేసుకుంటోంది.
పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని.. 2022 మే నుంచి ఒకేసారి యూనిట్ ధర రూపాయికి పెంచడం.. ఏం ప్రోత్సాహమో పారిశ్రామిక వేత్తలకు అర్థం కావడంలేదు. పారిశ్రామిక అవసరాలు.. తీర్చడానికి సముద్ర నీటి నిర్లవణీకరణ ప్రాజెక్టు.. వాటికి సరఫరా చేసే నీటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (Andhra Pradesh Industrial Infrastructure Corporation) ఆధ్వర్యంలో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలంటూ.. మూడేళ్ల కిందట జారీ చేసిన ఆదేశాలు ఏమయ్యాయి.
ఇక పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్లలో కొనుగోలు చేసే భూములకు నిర్దేశించిన ధరలో.. బీసీ పారిశ్రామికవేత్తలకు 50 శాతం రాయితీ ఇచ్చేలా టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని తొలగించి, భూముల కొనుగోలులో గరిష్ఠంగా రూ.20 లక్షల రాయితీని ఎత్తేయడం.. బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్లు కాదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి
చర్యలతో.. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి చెప్పుకోదగిన స్థాయిలో వచ్చిన పెట్టుబడులు వేళ్ల మీదే లెక్కించే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన.. పరిశ్రమల ప్రోత్హాహక, అంతర్గత వాణిజ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణకు రూ.44 వేల 595 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే.. ఏపీకి కేవలం రూ.6 వేల 485 కోట్లు మాత్రమే వచ్చాయి. విశాఖ సదస్సులో.. రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా.. అందులో రూ.9 లక్షల కోట్లు విద్యుత్ రంగానికి సంబంధించినవే. అందులోనూ.. మెజారిటీ పెట్టుబడులు జగన్ సన్నిహిత కంపెనీలవే. ఒకే తరహా పెట్టబడులతో.. రాష్ట్రానికి ఒరిగిందేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.