ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అజెండాలో పొరపాటున చేర్చామని చెప్పి తొలగించటం బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఆమె.. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అజెండాలో చేర్చారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి చాలా ఆనందపడ్డామన్నారు. ఆ తర్వాత పొరపాటున చేర్చామని హోదా అంశాన్ని కేంద్రహోమంత్రిత్వ శాఖ తొలగించటం పట్ల కలత చెందినట్లు తెలిపారు.
రాష్ట్రానికి హోదా దక్కకపోవటానికి చంద్రబాబే కారణమని హోంమంత్రి ఆరోపించారు. విభజన హామీలలో ప్రత్యేక ప్యాకేజీ చాలని గత ప్రభుత్వం చెప్పటం వల్లే ఆ అంశాన్ని పక్కన పెట్టినట్లు కేంద్ర పెద్దలు చెబుతున్నారన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశంపై ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో ప్రకటించిన మోదీ..అధికారంలోకి రాగానే హోదా అంశాన్ని విస్మరిస్తున్నారన్నారు.
ఈనెల 17న విభజన సమస్యలపై సమావేశం..
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలుగురాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల పంపకాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన సహా ఇతర అపరిష్కృత అంశాలపై.. ఈనెల 8నే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈనెల 17న మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశానికి.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్ నేతృత్వం వహించనుండగా.. ఏపీ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో ప్రత్యేక హోదా సహా మొత్తం 9 అంశాలపై చర్చించనున్నట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత హోదా అంశాన్ని పొరపాటున చేర్చామని అజెండా నుంచి తొలగించింది.
ఇదీ చదవండి
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మళ్లీ మొదలైన సీబీఐ విచారణ