HIGH COURT REACT ON YCP OFFICE LAND ISSUE: అనకాపల్లి జిల్లా జాతీయ రహదారికి అనుకుని ఉన్న రాజుపాలెం గ్రామ పరిధిలోని 1.75 ఎకరాల భూమిని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ 20న జారీచేసిన 759 జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌లో హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్, తహశీల్దార్, వైసీపీ ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి జిల్లా వైసీపీఅధ్యక్షుడికి నోటీసులు జారీచేసింది.
ప్రతివాదుల వాదనలు విన్నాక మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారాన్ని పరిశీలిస్తామని స్పష్టంచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. గ్రామంలోని 1.75 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకుందేకు వీలుకల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ కొత్తూరు నర్సింగరావుపేట మాజీ సర్పంచి కసిరెడ్డి సత్యనారాయణ మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎం.రవీంద్ర వాదనలు వినిపించారు. రాజుపాలెంలోని 1.75 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ‘గయాలు భూమి’గా(గ్రామీణుల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది) ఉందన్నారు. దానిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదన్నారు. ఆ భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించడం చట్ట విరుద్ధం అన్నారు. ఆ స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులిచ్చింది.
ఇవీ చదవండి