MP Raghu Ramakrishna Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చేసిన పరీక్షల రిపోర్టులను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. కస్టడీలో హింసించారనే ఆరోపణలపై సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు గతంలో గుంటూరు జీజీహెచ్ కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ వైద్యులు చేసిన పరీక్షల నివేదికలను భద్రపరచాలని స్పష్టం చేసింది. రికార్డులు భద్రపరచాలన్న రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా... ఆయన తరఫు న్యాయవాది వీ.వీ. లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు చిత్రహింసకు గురిచేసి కొట్టిన ఘటనలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు, ఇతర దస్త్రాలను భద్రపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది . గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దాఖలు చేసిన అఫిడవిట్లో మెడికల్ బోర్డు ఇచ్చిన వర్జినల్ కాపీ నివేదక తమ వద్దే ఉందని కోర్టుకు తెలిపారు . కార్డియాలజీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతులు ఇచ్చిన రిపోర్టుల వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇదీ జరిగింది: తనను పరీక్షించిన కార్డియాలజీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతులు 2021 మే 15, 16 తేదీల్లో ఇచ్చిన మెడికల్ రిపోర్టులు, నోట్ ఫైళ్లను కనుమరుగు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ చూస్తున్నారని పేర్కొంటూ.. ఎంపీ రఘురామ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కస్టడీలో ఉన్న ఎంపీని సీఐడీ పోలీసులు కొట్టారని అప్పట్లో ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. రిమాండ్‌కు హాజరు పరిచిన సందర్భంగా గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు 2021 మే 15న వాంగ్మూలం ఇచ్చారని పిటిషనర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయామూర్తి.. వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీని గుంటూరు జీజీహెచ్‌కు ఆ తర్వాత గుంటూరు రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని గతంలో ఆదేశించిందన్నారు. వివిధ విభాగాలకు చెందిన జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదికలలో గాయాలున్నాయని పేర్కొన్నారని తెలిపారు.
'ఎంపీ రఘురామకృష్ణరాజును పరీక్షించిన ఇప్పటి వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ బయటపెట్టలేదు. మెడికల్ బోర్డును రక్షించాలన్న ఉద్దేశంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్నారు. కార్డియాలజీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతులు ఇచ్చిన మెడికల్ రిపోర్టులు, నోట్ ఫైళ్లను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వాటిని భద్రపరిచే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరాం. వాదనలు విన్న న్యాయస్థానం వైద్యులు ఇచ్చిన నివేదికలు భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది' -వీ.వీ. లక్ష్మీనారాయణ, న్యాయవాది