High Court on Amaravati Farmers Lease Payment Issue: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా ప్రభుత్వం ఏదో ఒక విధంగా అడ్డుపెడుతూ వస్తోంది. కౌలు చెల్లించాలంటూ రైతు సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్‌రెడ్డి, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌కు విచారణార్హత ఉందని తేల్చి చెప్పింది.
రెండు సంఘాల్లోని రైతులు అందరూ కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశించింది. 10 రోజుల్లో కోర్టు ఫీజు చెల్లించిన తర్వాత పిటిషన్‌పై విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. రైతు సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. భూములిచ్చిన రైతులందరు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవాలని, రైతు సంఘాలు వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు.
రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రభుత్వ వాదనను వ్యతిరేకించారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదనడం సరికాదన్నారు. ఆర్థిక స్థోమత, చట్టాలపై అవగాహన లేని వారి తరఫున దాఖలైన వ్యాజ్యాలను విస్తృత కోణంలో చూడాలని జస్టిస్ కృష్ణ అయ్యర్ తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. తీర్పు ప్రతులను కోర్టుకు అందజేశారు. మేలో ఇవ్వాల్సిన కౌలును రైతులకు చెల్లించకుండా ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
భూములిచ్చిన రైతులు కౌలు కోసం వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ చేస్తున్న వాదన సహేతుకంగా లేదన్నారు. ఆ వాదనను తోసిపుచ్చండి అని కోరారు. 28 వేల 720 మంది రైతులు రాజధాని కోసం 34 వేల 396 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. వారిలో ఎకరాలోపు భూమి ఇచ్చిన వారు 20 వేల 176 మంది ఉన్నారన్నారు. ఎకరా నుంచి 2 ఎకరాల లోపు భూములిచ్చిన రైతులు 4 వేల 217 మంది ఉన్నారన్నారు.
కౌలు చెల్లించక పోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణార్హతపై తీర్పును ఇటీవల వాయిదా వేసింది. నేడు వ్యాజ్యాన్ని విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.