Anticipatory Bail to Auditor Sravan: మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఏలూరు చిట్స్ సహాయ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ సంవత్సరం మార్చిలో సీఐడీ నమోదు చేసిన కేసులో ఆడిటర్ కుదరవల్లి శ్రావణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తునకు సహకరించాలని పేర్కొన్నారు. 'డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విఫలమైందని ఒక్క చందాదారు ఫిర్యాదు చేయలేదని తెలపింది. రికార్డులను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతోందని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిపాజిటర్ల చట్టంలోని సెక్షన్ 5 కింద పిటిషనర్ నేరానికి పాల్పడినట్లు చెప్పలేమన్నారు. మిగిలిన సెక్షన్లన్నీ ఏడు సంవత్సరాల లోపు జైలు శిక్షకు వీలున్నవే. ఇదే తరహా ఆరోపణలతో నమోదైన కేసుల్లో దర్యాప్తు అధికారి ఇప్పటికే పిటిషనర్‌పై ఆరోపణలను పరిశీలించారు. వివరాలన్ని సీఐడీ స్వాధీనంలో ఉన్నాయని.. ముందస్తు బెయిలు మంజూరు చేయడానికి ఇది తగిన కేసు' అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఏలూరు చిట్స్ సహాయ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఆడిటర్ శ్రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కంభంపాటి రమేశ్ బాబు వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ముందస్తు బెయిలు మంజూరు చేశారు.
ఐపీసీ సెక్షన్ 409 వర్తించదు: న్యాయవాది.. "కుదరవల్లి శ్రావణ్ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఉద్యోగి కాదు, ఆడిటర్ మాత్రమేనని.. పబ్లిక్ సర్వెంట్ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఐపీసీ 409 (పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్, మర్చెంట్, ఏజెంట్ నేరపూర్వక విశ్వాస ఘాతుడానికి పాల్పడటం) కింద సీఐడీ నమోదు చేసిన సెక్షన్ వర్తించదు. విజయవాడ, విశాఖ చిట్స్ సహాయ రిజిస్ట్రార్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీఐడీ వేర్వేరుగా నమోదు చేసిన కేసుల్లో ఇప్పటి పిటిషనర్ బెయిలు పొందారు. వివరాలన్ని సీఐడీ స్వాధీనం చేసుకుంది. ఇంకా దర్యాప్తు చేయడానికి మిగిలిందేమి లేదు. ప్రస్తుత కేసులో ఆరోపణలు విశాఖ, విజయవాడ ఫిర్యాదులను పోలి ఉన్నాయి. ఈ కేసులో పిటిషనర్‌ను అరెస్ట్ చేయాల్సి వస్తే బెయిలుపై విడుదల చేయాలని సీఐడిని ఆదేశిస్తున్నాం. విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయం డీఎస్పీ సంతృప్తి మేరకు రూ.50వేల విలువ కలిగిన రెండు పూచీకత్తులు సమర్పించాలి. పిటిషనర్ దర్యాప్తునకు సహకరించాలి.' అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.