High Court on Corporation Employees Retirement: ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలన్న సింగిల్ జడ్జి తీర్పును.. హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ "ఏపీ విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ"- A.P.E.W.I.D.C ఎండీ, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ D.V.S.S.సోమయాజులు, జస్టిస్ V.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 5న ఈ తీర్పు వెలువరించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు వేర్వేరనే విషయం ప్రస్తావించింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్-1984 నిబంధన మేరకు ప్రభుత్వ సర్వీసు కింద నియమితులై, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపడి ఉన్న ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలు అందుతాయని... కార్పొరేషన్ ఉద్యోగులకు రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలు చెల్లించరని స్పష్టం చేసింది.
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పొడిగించేలా ఆదేశించాలని కోరుతూ.. A.P.E.W.I.D.Cతోపాటు మరికొన్ని కార్పొరేషన్ల ఉద్యోగులు గత సంవత్సరం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి... 62 ఏళ్ల పదవీ విరమణ వయసు పొందేందుకు పిటిషనర్లు అర్హులని తేల్చిచెప్పారు. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, A.P.E.W.I.D.C ఎండీ గతేడాది డిసెంబర్‌లో ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. వాటిపై ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ S.శ్రీరామ్.. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.
కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే విధులు నిర్వహిస్తారని.. అందువల్ల వారికి కూడా 62 ఏళ్లు వర్తిస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. 62 ఏళ్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల్లాగే కార్పొరేషన్ల ఉద్యోగులు ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదని తేల్చి చెప్పింది. కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులకు సొంత సర్వీసు నిబంధనలు ఉంటాయని తెలిపింది. కార్పొరేషన్లే వారికి జీతాలు చెల్లిస్తాయని గుర్తు చేసింది. అందువల్ల 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయసు కల్పించాలని పిటిషనర్లు కోరలేరని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: