MLAs Poaching Case Update: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది.
సీబీఐకి అప్పగించిన హైకోర్టు: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసందే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్ జనరల్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.
ఇవీ చదవండి: