Hepatitis Cases Increasing in AP: హెపటైటిస్ బీ, సీ వైరస్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్నవారిలో కొందరికి కాలేయ క్యాన్సర్ సోకుతోంది. హెపటైటిస్ వైరస్‌లో....ఏ, బీ, సీ, డీ, ఈ అని ఐదు రకాలున్నాయి. ఇందులోబీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకే ఏ, ఈ రకాల వల్ల కామెర్లు వస్తున్నాయని వివరిస్తున్నారు. హెపటైటిస్-ఏకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్-B బాధితుల నుంచి రక్తం, లాలాజలం, వీర్యం, యోని స్రావాలతో ఇతరులకూ వ్యాపిస్తోంది. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు ఉపయోగించిన ఇంజెక్షన్లు, పచ్చబొట్లు, షేవింగ్, బ్లేడ్లు, ట్రూత్ బ్రష్‌లు వాడటం వల్ల ఈ వ్యాధి సోకుతోంది. బాధితుల్లో జ్వరం, అజీర్ణం, వాంతులు, వీరేచనాల సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
జాతీయస్థాయిలో హెపటైటిస్-బీ మరణాలు..
జాతీయస్థాయిలో హెపటైటిస్-బీలో మరణాలు ఒక శాతం వరకు ఉన్నాయి. కేంద్ర సిరో సర్వైలెన్స్ ద్వారా రాష్ట్రంలో హెపటైటిస్-బీ 2.3శాతం, హెపటైటిస్-సీ 0.3శాతం వ్యాప్తి ఉన్నట్లు తేలింది. జాతీయ స్థాయిలో హైపటైటిస్-బీ 0.9శాతం, హెపటైటిస్-సీ 0.32శాతంగా ఉంది. రాష్ట్రంలోని జైళ్లల్లో ఉండే ఖైదీల్లో....2.6 శాతం మందికి హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీతో 0.5శాతం మంది ఉన్నారని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా తేలింది. గుంటూరు జిల్లాలో 7 శాతం వరకు హెపటైటిస్ ప్రభావం ఉందని చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో 100 మంది రోగుల్లో 10 మందికి హెపటైటిస్ సమస్య ఉందని వైద్యులు తెలిపారు.
గర్భిణికి జ్వరం, కామెర్లు వస్తే..
గర్భందాల్చిన మూణ్నెళ్లకు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు హెపటైటిస్ పరీక్ష చేస్తున్నారు. గర్భిణికి జ్వరం, కామెర్లు వస్తే మాత్రం జిల్లాకేంద్రంలో ఉండే ట్రీట్మెంట్ సెంటర్లో చికిత్స అందించాలని... కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. ఇక్కడ వైద్యుల సిఫార్సుతో యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారని హెపటైటిస్ ప్రోగ్రామ్ అధికారులు చెబుతున్నారు. శిశువు పుట్టిన 12గంటల్లోగా శిశువుకు ఇమ్యూనోగ్లోబిన్స్ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ‘ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా హెపటైటిస్ పాజిటివ్ వచ్చిన వారిలో....ఒక శాతం మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా నిర్ధరణ జరుగుతోంది. హెపటైటిస్-బీ, సీ సైలంట్ కిల్లర్లని వైద్యులు చెబుతున్నారు. ఒకే ఇంట్లో ఒకరికి హెపటైటిస్ వస్తే ఇద్దరు, ముగ్గురు బాధితులన్న కేసులు దృష్టికొస్తున్నాయంటున్నారు. హెపటైటిస్ ఏ, ఈ వస్తే బాధితుల్లో మాదిరిగా బీ, సీ వైరసుల్లో లక్షణాలు కనిపించడలేదు. ఈ రెండూ క్యాన్సర్ కారకాలవుతున్నాయి.
ప్రత్యేక సెంటర్ల ఏర్పాటు..
ప్రతి బోధనాసుపత్రిలో హెపటైటిస్ రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. హెపటైటిస్‌కు తొలి డోసు పొందిన వైద్యసిబ్బందికి నెల తర్వాత 2, ఆరు నెలల్లో మూడో డోసు ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: Thallibidda Express: ఆగిపోతున తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు.. బాలింతల ఆందోళన