rain in AP and Telangana states: తమిళనాడు -కర్ణాటకల మీదుగా ఉత్తరాది వరకూ 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో ఆవరణంలో పశ్చిమ అలజడులు కొనసాగుతున్నట్టు తెలియచేసింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో దక్షిణ గాలులు కూడా వీస్తున్నాయని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. చాలా చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లా, అనకాపల్లి, సహా తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలులోనూ ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ విభాగం తెలియచేసింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్ణాటకలోని గుల్బర్గా, అనంతపురం జిల్లాల్లో 40.7 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది.
ఆదోనిలో భారీ వర్షం: కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండలు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. సాయంత్రం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు నిండటంతో నీరు రోడ్ పై చేరింది. గత కొన్ని రోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం: భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ నారాయణ గూడ , లిబర్టీలలో భారీ వర్షం కురిసింది. తార్నాక ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం మల్లాపూర్... పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓయూ తార్నాకలో వడగళ్ల వాన కురిసింది. దీంతో వాన దారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అంతరాయం కలిగింది. వడగళ్ల వానతో వాహనదారులు మెట్రో మెట్రో స్టేషన్ల వద్ద ఆగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షం నీరు ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇవీ చదవండి: