Heavy Power Cuts In Andhra Pradesh: అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంగా మారుతోంది. ముఖ్యంగా రాత్రి పూట గంటల తరబడి కరెంటు పోతుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో.. మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియక నానా అవస్థలతో సతమతమవుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మళ్లీ చీకటి రోజుల్లోకి వెళ్తున్నామన్న ఆవేదన గ్రామీణుల్లో వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గాడితప్పింది. డిమాండ్‌లో భారీ పెరుగుదల లేకున్నా.. ప్రభుత్వం సరఫరా చేయలేని స్థితికి వచ్చింది అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో సుమారు 3 మిలియన్ యూనిట్లు కోత విధించినట్లు సమాచారం. సోమవారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు కొన్ని ఫీడర్‌ల పరిధిలో విద్యుత్ కోతలు విధించినట్లు అధికారులు చెబుతున్నా.. గ్రామాల్లో ఐదారు గంటలపాటు కరెంటు లేదు. చాలా గ్రామాల్లో రాత్రి 11 తర్వాత కూడా సరఫరా పునరుద్ధరించలేదు.
Power Cut in Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ కోతలు.. నరకం చూస్తున్న రోగులు..
రాష్ట్రంలో కొన్ని రోజులుగా విద్యుత్ వినియోగం 225 మిలియన్ యూనిట్ల మధ్య ఉంటోంది. ఆదివారం 225.31 ఎం.యూల డిమాండ్ ఉంది. థర్మల్ విద్యుత్ 87.93, జలవిద్యుత్ 8.24, పునరుత్పాదక, ఇతర వనరుల నుంచి 55.79 మిలియన్ యూనిట్ల చొప్పున వచ్చింది. 44.31 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేంద్ర సంస్థల నుంచి, బహిరంగ మార్కెట్‌లో 33ఎంయూ(Million Units) విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి.
డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో కనీసం 10 నుంచి 15 ఎంయూల మేర డిస్కంలు కొనాల్సి వస్తోంది. ఇందుకు ముందుగానే డబ్బు చెల్లించాలి. రోజు మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లకు సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయలు అవసరం. ఇటీవల బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లకు భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో డిస్కంలకు నిధులు సర్దుబాటు కావడం లేదని.. ప్రభుత్వమూ సమకూర్చడం లేదని.., దాని ఫలితంగానే గాడాంధకమని తెలుస్తోంది.
జెన్‌కో థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడం, జల విద్యుత్ అందుబాటులో లేకపోవడం, పవన విద్యుత్ ఆకస్మికంగా పడిపోవడం వంటి కారణాలతో డిమాండ్, ఉత్పత్తికి మధ్య అంతరం పెరిగింది. వార్షిక నిర్వహణ పేరిట ఆర్టీపీపీ. వీటీపీఎస్‌లో ఒక్కో యూనిట్‌లో ఉత్పత్తి నిలిచింది. సాంకేతిక కారణాలతో కృష్ణపట్నంలోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ఆగింది. బొగ్గు లభ్యత కొరవడటంతో వల్ల హిందుజాలో ఒక యూనిటే పనిచేసింది.
శ్రీకాకుళం డివిజన్‌లో సాయంత్రం 7 తర్వాత.. 85 సబ్ స్టేషన్ల పరిధిలో రొటేషన్ విధానంలో కోతలు అమలయ్యాయి. విజయనగరంలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. ఎస్.కోట, గజపతినగరంలోనూ కోతలు విధించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని చాలా గ్రామాల్లో రాత్రి 7 నుంచీ కరెంటు లేదు.
Prathidwani: ఏపీలో ఈ స్థాయిలో విద్యుత్ సంక్షోభం ఎందుకొచ్చింది?
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రాత్రి 9 నుంచి కరెంటు లేదు. తిరువూరు, బంటుమిల్లి మండల కేంద్రాల్లోనూ కోతలు అమలయ్యాయి. పల్నాడు జిల్లా ఈపూరు, గురజాల, వినుకొండ మండలాల్లోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. రాజధాని గ్రామాల్లో రాత్రి 7 నుంచి పదిన్నర వరకు కరెంటు లేదు.
నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి కరెంటు లేదు. ఉలవలపాడు, గుడ్లూరు, వలేటివారిపాలెం, కావలి, వరికుంటపాడు, విడవలూరు గ్రామాలు అంధకారంలో మగ్గాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాత్రి 8 నుంచి గంట పాటు కోతలు విధించారు. ప్రొద్దుటూరులోనూ గంట సేపు సరఫరా నిలిపేశారు.