Minister Vidadala Rajini On Kidney Racket: కిడ్నీ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిడ్నీ రాకెట్ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. విశాఖలోని పెందుర్తి తిరుమల ఆస్పత్రి ఘటన తమ దృష్టికి రాగానే విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విశాఖ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి ఆస్పత్రిని సీజ్ చేశారని మంత్రి వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల ఆస్పత్రికి అసలు అనుమతులు లేవని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయ్యాయని వివరించారు.
తిరుమల ఆస్పత్రి వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వారిని విచారించి అసలు నిజాలు రాబడతామన్నారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టబోమని తెలిపారు. ఇటువంటి ఘటనలకు తావు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వేస్తామని స్పష్టం చేశారు. అవయవాలను వాడుకుని చట్ట విరుద్ధంగా వ్యాపారం చేసే ఆస్పత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
అసలేం జరిగింది: రాష్ట్రంలో కిడ్నీ విక్రయాల మోసాలు గత పదిహేను రోజుల వ్యవధిలో రెండు వెలుగు చూశాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఓ వ్యక్తి తన కిడ్నీని విక్రయిస్తే ఆసుపత్రి యాజమాన్యం తనని మోసం చేసిందని ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి.. అనంతరం తన ఇష్ట ప్రకారమే కిడ్నీ విక్రయించినట్లు మరో వీడియో విడుదల చేశాడు. అయితే దానిపై ఐదుగురితో కూడిన ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది జరిగి రెండు వారాలు గడువక ముందే విశాఖలోని పెందుర్తిలో మరోటి వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ యువకుడికి కిడ్నీ అమ్మితే డబ్బులు ఇస్తానని మరో వ్యక్తి నమ్మించాడు. డబ్బులు వస్తాయన్న ఆశతో ఎనిమిదిన్నర లక్షలకు అతను తన కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే అనుకున్న డబ్బుల కన్న తక్కువ ఇవ్వడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటకు వచ్చింది. అలా ఒకదాని తర్వాత ఒకటి కిడ్నీ మోసాలు వెలుగు చూస్తుండడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ఓ కమిటీ వేస్తామని మంత్రి విడదల రజనీ తెలిపింది.
ఇవీ చదవండి: