Harassments in YSRCP Govt: రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆగడాలకు అనేకమంది బలయ్యారు. వైసీపీ నేత కుట్రకు ఈ నెల 14న తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ బలైంది. బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటకు చెందిన కోటిపల్లి కామాక్షి కుటుంబం.. రోడ్డును ఆనుకుని ఉన్న 2 సెంట్ల స్థలంలో గుడిసె వేసుకుని 40 ఏళ్లుగా ఉంటోంది. ఆ పక్కనే బాదిరెడ్డి అప్పారావు ఇల్లు ఉంది. వీటిని ఆనుకుని 48 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న జెడ్పీ భూమిలో లేఅవుట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కామాక్షి ఇల్లు తొలగిస్తే లేఅవుట్‌కి అడ్డం ఉండదని భావించిన వైసీపీ నాయకులు.. కొత్త ఇల్లు మంజూరు చేశామని నమ్మించి 4 నెలల కిందట కామాక్షి కుటుంబానికి చెందిన ఇంటిని తొలగించారు. మోసపోయినట్లు ఆ తర్వాత గుర్తించిన కామాక్షి... తమ స్థలంలో టెంటు వేసుకున్నారు. వెంటనే ఎంపీడీఒ వెళ్లి దాన్ని తొలగించి, స్థలం చుట్టూ కంచె వేయించారు. ఏంచేయాలో దిక్కుతోచక కామాక్షి, ఆమె కుమారుడు మురళీకృష్ణ ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామాక్షి మృతి చెందగా, మురళీకృష్ణ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితులు సెల్ఫీ వీడియోలో ప్రస్తావించిన వ్యక్తులను పోలీసులు నిందితులుగా చేర్చలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ నాయకులు, అధికారుల దౌర్జన్యానికి ఆనందపురం మండలం పొడుగుపాలేనికి చెందిన 81 ఏళ్ల వృద్దురాలు శినగం ఎల్లమ్మ.. గత నెల 27న బలైపోయారు. సర్వే నెంబరు 43/23లోని ప్రభుత్వ భూమిలో చాన్నాళ్ల నుంచి గ్రామస్థులు పాకలు వేసుకుని ఉంటున్నారు. 6 నెలల క్రితం స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు వాటిని తొలగించారు. అక్కడ అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపట్టగా.. బాధితులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎల్లమ్మను పొక్లెయిన్ ఢీకొట్టగా, తీవ్ర గాయాలై ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన తెలుగుదేశం నేత కురవ సిద్ధన్నను గత నెల 19న వైసీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి చంపారు. సర్పంచి ఎన్నికల్లో సిద్ధన్న తల్లి లచ్చమ్మను పోటీలో నిలిపారు. తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన వైసీపీ వర్గీయులు ఆయన్ను చంపేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు రిమాండులో ఉన్నారు. విజయవాడకు చెందిన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై.. సెప్టెంబర్ మూడో తేదీన వైసీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇనుపచువ్వతో ఆయన కన్ను పొడిచేశారు. ఈ ఘటనపై రోజంతా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేశారు. తర్వాత కేసు పెట్టినా హత్యాయత్నం సెక్షన్లు లేవు. వైసీపీ నాయకుడు వల్లూరి ఈశ్వర్ ప్రసాద్‌ను నిందితుడిగా చేర్చినా అరెస్టు చేయలేదు. మిగతా నిందితులు గద్దె కల్యాణ్, సుబ్బు, లీలాకృష్ణ ప్రసాద్‌ను అరెస్టు చేసినా, గాయం నివేదికను కోర్టుకు సమర్పించకపోవటంతో వారి రిమాండు తిరస్కరణకు గురైంది.
కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం నాయకుడు పి.శేషగిరిరావుపై.. ఈ నెల 17న ఆయన నివాసంలో ఓ వ్యక్తి హత్యయత్నం చేశారు. భవానీ భక్తుడిలా వచ్చి కత్తితో దాడి చేశారు. యనమల కృష్ణుడు, శేషగిరిపై దాడి చేస్తాం. మీరెవెరూ రావొద్దని మంత్రి దాడిశెట్టి రాజా కొన్ని రోజుల కిందట తునిలోని ఇద్దరు సీఐలను పిలిపించి చెప్పారని... ఈ హత్యాయత్నం వెనుక వారే ఉన్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
2022 నవంబర్ 7న శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రిపై... వారి బంధువు, వైసీపీ నాయకుడు రామారావు హత్యాయత్నం చేశారు. వారిపై ట్రాక్టర్‌తో కంకర మట్టిని అన్‌లోడ్ చేయించారు. ఈ ఘటనలో కొట్ర రామారావుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు రిమాండులో ఉన్న ఆయన, ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. 2022 సెప్టెంబర్ 26న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్సీ కౌన్సిలర్ మల్లికార్జున ఇంట్లోకి చొరబడి.. ఆయనతో పాటు తల్లి, సోదరిపైనా దాడి చేశారు. ఈ కేసులో హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. నిందితులనూ అరెస్టు చేయకుండా నోటీసులిచ్చి వదిలేశారు.
2022 ఆగస్టు 03న గుంటూరు వైసీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి వేధిస్తున్నారంటూ సీఎం జగన్‌కు లేఖ రాసి... గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి చెన్నంరాజు గిరిధరవర్మ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ వెంకటరెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
భూకబ్జాల కోసం వైసీపీ నాయకులు ఎంతో మంది ఉసురు తీశారు. అనకాపల్లి జిల్లా శంకరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 28లో ఎస్సీ వర్గానికి చెందిన జల్లూరి భీమన్నకు 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం 2 ఎకరాలు అసైన్ చేసింది. ఈ భూమిలో జీడితోటలు సాగు చేసుకునేవారు. హుద్‌హుద్ తుపానుకు తోటలు ధ్వంసమైపోగా.. అప్పటి తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. దీనిపై భీమన్న కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించగా, అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటికే కొందరు అక్కడ కొంత భూమి ఆక్రమించి, కల్యాణ మండపం కట్టేశారు. మిగతా భూమి వైసీపీ కార్యాలయ నిర్మాణానికి అనువుగా ఉందని, దాన్ని ఇచ్చేయాలని కొందరు నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఈనాడులో కథనం రావడంతో... భీమన్న వారసులను వైసీపీ నాయకుడు పిలిపించి బెదిరించారు. బాధితులు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఫిర్యాదును అధికారులు మూసేశారు. ప్రస్తుతం ఆ భూమి భీమన్న వారసుల చేతిలోనే ఉంది.
2022 అక్టోబర్ 29న ప్రభుత్వాన్ని విమర్శించారంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన జనసేన కార్యకర్త మారిశెట్టి శ్రీనివాసరావుపై.. వైసీపీ నాయకులు దాడిచేశారు. తిరిగి ఆయనపైనే ఫిర్యాదు చేశారు. ఆందోళనకు లోనైన శ్రీనివాసరావు.. ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు తనపై దాడి చేశారని సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించారు. శ్రీనివాసరావే తమను కులం పేరుతో దూషించారంటూ వైసీపీ మద్దతుదారు కారంశెట్టి విజయరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.
2022 అక్టోబర్21న శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన కార్యాలయంపై 30 మంది దుండగులు దాడి చేశారు. విలువైన సామగ్రి ధ్వంసం చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులు ఇప్పటివరకూ ప్రయత్నించలేదు. వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారంటూ కొందరు అనుమానితుల పేర్లతో జనసేన నాయకుడు కిరణ్‌కుమార్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
2022 ఆగస్టు 25న కుప్పంలో తెలుగుదేశం కార్యకర్తలు ఏర్పాటుచేసిన అన్నక్యాంటీన్ ఫ్లెక్సీలను చించేసి వైసీపీ నాయకులు.. ఆ పార్టీ నాయకుడు రవిచంద్రబాబుపై దాడి చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దకు వెళ్లడానికి తెదేపా కార్యకర్తలు ప్రయత్నించగా.. వారిపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు PA మనోహర్, తెలుగుదేశం కార్యకర్త రాజుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. తర్వాత అదే నెల 30న అన్నక్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
21022 అక్టోబర్8న కృష్ణా జిల్లా పెడనలో మంత్రి జోగి రమేష్‌ను ఉద్దేశించి గోడపత్రికలు అంటిస్తున్నారంటూ.. జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులతో పాటు జనసేన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
2022 నవంబర్ 04న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో రహదారి విస్తరణ పేరిట జనసేన, తెలుగుదేశం సానుభూతిపరులకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చేశారు. జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చినందునే కక్షకట్టి ఇళ్లు కూల్చివేశారని బాధితులు వాపోయారు. కూల్చివేతలు జరిగి 15 రోజులు దాటినా రహదారి విస్తరణ పనులు మాత్రం మొదలుకాలేదు.
2022 నవంబర్ 08న విశాఖలో ఆంధ్ర వర్సిటీ వసతిగృహాల సమీపంలో ఉన్న 16 దుకాణాలను ఈ నెల 8న GVMC అధికారులు కూల్చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దుకాణాలను నేలమట్టం చేశారు. బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
2022నవంబర్ 15న నంద్యాల జిల్లా డోన్‌లో తెలుగుదేశం నాయకుడు మురళీకృష్ణగౌడ్ వెంచర్‌కు రక్షణగా నిర్మించిన గోడను.. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు కూల్చేశారు. చంద్రబాబు డోన్ పర్యటన సందర్భంగా తన ఇంటికి వచ్చారన్న అక్కసుతోనే రక్షణ గోడను కూల్చేశారని మురళీకృష్ణగౌడ్ వాపోయారు.
2022 నవంబర్ 20న శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో 11వ వార్డు కౌన్సిలర్ వాజీదా భర్త, వైసీపీ నాయకుడు నూరుల్లా... కళావతమ్మ కుటుంబానికి చెందిన ఇంటిని, ఇమాంబీ కుటుంబానికి చెందిన షెడ్డును పొక్లెయిన్‌తో కూల్చివేయించారు. కానీ దీనిపై చర్యలే లేవని బాధితులు వాపోయారు.
ఇవీ చదవండి: