తహసీల్దార్ పట్ల దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై... వైకాపా నేతల మీద శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామం ఐదో సచివాలయం 13వ వార్డు వాలంటరీ బిందుప్రియ ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు ఉందని తహసీల్దార్ పెంచల ప్రభాకర్ తిరస్కరించారు. ఈ విషయమై కలెక్టర్ వివేక్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు... బిందుప్రియ ఫిర్యాదు చేసింది. విషయం తెలిసుకున్న చేబ్రోలు తహశీల్దార్ ప్రభాకర్.. ఆమెను మందలించారు.
అనంతరం.. తనకు పత్తిపాడుకు చెందిన రత్నారెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశారని బిందుప్రియ తెలిపింది. కలెక్టర్ పీఏగా రత్నారెడ్డి పరిచయం చేసుకుని తనను బెదిరించినట్టు ఆరోపించింది. ఈ విషయంపై వైకాపా నేతలు వాసా శ్రీనివాసరావు, లలతిచౌదరి, జైపాల్ రెడ్డి, కోటేశ్వరరావు, బుల్లయ్యతో పాటు.. మరి కొందరు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద.. బిందుప్రియకు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించారు.
ఆ యత్నాన్ని తహసీల్దార్ ప్రభాకర్ అడ్డుకున్నారు. ఆయన తీరుపై వైకాపా నేతలు అభ్యంతరం చెప్పారు. వాగ్వాదానికి దిగారు. బిందుప్రియను తహసీల్దారే బెదిరించి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనపై.. తహసీల్దార్ పోలీసులను ఆశ్రయించారు. తనపై వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారని ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
తెదేపా మాజీ ఎమ్మెల్యే శెట్టి రంగనాయకులు మృతి..పలువురు సంతాపం