గుంటూరు మార్కెట్ యార్డులో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టిన అనంతరం అక్కడికి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలను తరలించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత భవనాలు వైద్య కళాశాల అవసరాలకు తగ్గట్లు సరిపోవడంలేదన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. దీనిపై సంబంధిత శాఖలు, భాగస్వాములతో చర్చించాలని ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలకు స్థలాల గుర్తింపు, భవనాల నిర్మాణాల విషయమై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ప్రస్తుతం 12 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల నడుస్తోంది. స్టాఫ్ క్వార్టర్స్ మినహా మిగిలిన విషయాల్లో పెద్దగా ఇబ్బందుల్లేవు. గుంటూరు మార్కెట్ యార్డు స్థలం 50 ఎకరాల వరకూ ఉంది. ఈ స్థలాన్ని విక్రయించాలని ఈ మధ్య ప్రభుత్వం నిర్ణయించగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ యార్డులో నిర్మాణాలు చేపట్టి వైద్య కళాశాలను అక్కడికి తరలించాలని భావిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘వైద్య కళాశాలకు సమాచారం లేదు’
వైద్య కళాశాల వర్గాలు మాత్రం తరలింపు పరిశీలన చర్యలపై తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నాయి. మార్కెట్ యార్డుకు వైద్య కళాశాలను తరలించే విషయాన్ని పరిశీలించాలని, ఉపముఖ్యమంత్రి దీనిపై సంబంధిత వర్గాలతో చర్చించాలని ఉన్నత స్థాయి సమావేశ ‘మినిట్స్’లో ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది.
విమ్స్‌కు కేజీహెచ్ ఇన్‌పేషంట్ల తరలింపు!
విశాఖ కేజీహెచ్‌లో కొత్త బ్లాకుల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అక్కడ ఉన్న ఇన్ పేషంట్లను విమ్స్‌కు తరలించే విషయాన్నీ వైద్య ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు