గుంటూరు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చివరి విడతలో సేకరించిన భూములకు ఇప్పటికి సొమ్ములు చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా 103 బిల్లులకు సంబంధించి 360కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. భూములు సేకరించే క్రమంలో రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాకే అధికారులు వాటిని తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించారు. నెలలు గడుస్తున్నా సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చినందున అక్కడ పంటలు సాగు చేయటం లేదు. ఓవైపు పంటలు లేకపోవటం, మరోవైపు చేసిన అప్పులు చెల్లించలేక రైతులు సతమతమవుతున్నారు. అధికారులను అడుగుతున్నా ఎప్పుడు చెల్లించేది స్పష్టంగా చెప్పటం లేదు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ తెలిపారు. నిధుల లభ్యత ఆధారంగా త్వరలో చెల్లిస్తామన్నారు.
ఇవీ చదవండి