Threats to TDP Activist in Guntur District: గుంటూరు జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. టీడీపీ కార్యకర్త ఇంటికి వచ్చి బెదిరించాడు. అంతకు ముందు గ్రామంలో పలువురిని.. టీడీపీ కార్యకర్త గురించి వాకబు చేసినట్టు స్థానికులు తెలిపారు. ఇంత జరిగిన తరువాత.. ఆ వ్యక్తిని తీసుకొని పోలీసులకు అప్పగించగా.. మతిస్థిమితం సరిగ్గా లేదని విడిచిపెట్టేశారు. ప్రస్తుతం ఇది పలు అనుమానాలను రెకెత్తిస్తోంది.
అసలు ఏం జరిగిందంటే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కాంతేరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బండారు కోటేశ్వరరావు ఇంటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. తెల్ల దుస్తులు ధరించి మెడలో నల్ల రంగు కండువా వేసుకొని ఉన్నాడని కోటేశ్వరరావు తెలిపారు. ఇంటికి వచ్చి కోటేశ్వరరావు నువ్వేనా అని సదరు వ్యక్తి ప్రశ్నించాడు.
అంతకుముందు జయరామయ్య ఫోన్ నెంబర్ కావాలని అడిగాడని అక్కడకి వచ్చిన టీడీపీ నాయకులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి.. వెంటనే మరికొంత మందిని పిలిచాడు కోటేశ్వరరావు. ఆ సమయంలో ఆ సదరు వ్యక్తి.. కోటేశ్వరరావుని బెదిరించినట్టు సమాచారం.
దీంతో అందరూ కలిసి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. తరువాత తాను ఎవరు, ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, ఏం చేద్దాం అని వచ్చావు ఇలా పలు రకాలుగా ప్రశ్నలు వేయగా.. అతని పేరు రవీంద్ర అని చెప్పాడు. అతనిని పరిశీలించగా.. జేబులో ఓ గుర్తింపు కార్డు దొరికింది. దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. అతని పేరు ఎన్. రవీంద్ర అని, నియోజకవర్గ బీసీ సెల్ ఇంచార్జ్, అయ్యవారి పాలెం గ్రామం, రాజుపాలెం మండలం, కడప జిల్లా అని వివరాలు ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తిని వెంటనే పోలీసులకు అప్పగించారు.
కానీ అతనిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా.. సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని విడిచిపెట్టేశారు. పోలీసుల తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడని.. అందుకే ఇలా బెదిరిస్తున్నారని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి: