Guntur Mirchi Marchant Kidnapping incident updates: గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డ్ సమీపంలో మిర్చి ఎగుమతి చేస్తున్న వ్యాపారి నరేంద్ర కుమార్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. వినుకొండ వద్ద వ్యాపారిని గుర్తించిన పోలీసులు అతడిని గుంటూరుకు తీసుకువచ్చారు. అనంతరం నరేంద్ర కుమార్‌ను అతని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. నరేంద్ర కుమార్ ముఖంపై కిడ్నాప్ చేసిన వ్యక్తులు కొట్టిన గాయాలు స్పష్టంగా కన్పించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అనంతరం వ్యాపారి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. మొత్తం ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి తనను అపహరించారని తెలిపారు. చిలకలూరిపేటలో నలుగురు దిగిపోయారని వ్యాపారి పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వెనుక బర్మా వెంకటరావు అనే మిర్చి వ్యాపారి హస్తముందని ఆయన ఆరోపించారు. కోటప్పకొండ వద్ద వెంకట్రావు కారు ఎక్కారని.. దుండగులు కోటీ 50 లక్షలు డిమాండ్ చేశారని నరేంద్ర వెల్లడించారు. గాయంతో తడిసిన చొక్కాను మార్చేందుకు దుండగులు ప్రయత్నించారని.. ఈలోగా పోలీసుల వాహన తనిఖీలతో..వారు కారుతోపాటు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతోనే తాను క్షేమంగా తిరిగి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరారని నరేంద్ర తెలిపారు.
అసలు ఏం జరిగిదంటే.. వ్యాపారి నరేంద్ర మిర్చి యార్డ్ నుంచి ఈరోజు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు బలవంతంగా అతడిని కారులో ఎత్తుకెళ్లారు. దీంతో తన తండ్రి అపహరణ ఉదంతాన్ని కుమారుడు కృష్ణచైతన్య నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వినుకొండ వద్ద వ్యాపారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మరోవైపు వ్యాపారి నరేంద్ర కిడ్నాప్ ఘటనను నిరసిస్తూ మిర్చియార్డు ముందు ప్రధాన రహదారిపై ఎగుమతి, దిగుమతుల వ్యాపారులు ధర్నా నిర్వహించారు. మిర్చియార్డులో క్రయవిక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా యార్డు ఛైర్మన్ చంద్రగరి ఏసురత్నం, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ వ్యాపారులతో సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరగా దుండగులను పట్టుకునేలా పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని వారు చెప్పారు.
బర్మా వెంకటరావు అనే వ్యక్తితో మాకు అతనికి ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి. పోలీసు సేష్టన్‌లో కేసులు కూడా ఉన్నాయి. మా వ్యాపారాన్ని పక్కన పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం. మా నాన్నను కిడ్నాప్ చేసింది.. చేయించింది బర్మా వెంకటరావే. -కృష్ణచైతన్య, నరేంద్ర కుమారుడు
ఇవీ చదవండి