గుంటూరులోని పలు వార్డు సచివాలయాలను నగర కమిషనర్ చల్లా అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెక్రటరీలు సకాలంలో విధులకు హాజరుకాకపోవటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హాజరు పట్టికలు, డైరీలను తనిఖీ చేసింది. అనంతరం వాలంటీర్లు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.
ఉదయం 10 గంటలకే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు అందజేయాల్సిన ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను నిర్దేశిత సమయంలో వాలంటీర్లు అందజేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరించి, వారు హోం క్వారంటైన్లో ఉండేలా చూడాలన్నారు. ఆన్లైన్లో పన్నులు చెల్లించేలా ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు. డబ్బులు చెల్లించేవారు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయం లేదా ప్రత్యేక కౌంటర్లలో పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: డ్రైవర్ నిర్లక్ష్యం... రోడ్డునపడ్డ కుటుంబం