సర్వే లెన్స్, కరోనాపై ప్రజలకు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సచివాలయ సిబ్బందిపై చర్యలు తప్పవని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. అమరావతి, గోరంట్లలో పర్యటించి సర్వ్ లెన్స్, అవగాహన కార్యక్రమాలు నిర్ధేశిత విధానంలో జరగట్లేదని గమనించారు. సంబంధిత నోడల్ అధికారి సచివాలయ కార్యదర్శులపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోడల్ అధికారులు ప్రతి రోజు వారికి కేటాయించిన సచివాలయాల పరిధిలో సర్వ్ లెన్స్, ఆక్సీ మీటర్, డిజిటల్ థర్మామీటర్ ద్వారా జరిగే పరీక్షలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
సచివాలయ కార్యదర్శులు అందరూ ఈ సర్వేలో పాల్గొనాలని కమిషనర్ ఆదేశించారు. సర్వేలో ఎవరికైనా కొవిడ్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడికల్ అధికారికి తెలిపి పరీక్షకు పంపాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. పాజిటివ్ నిర్ధరణైన ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు