Water Scarcity In Joint Guntur: ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇలాంటి తరుణంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవికి ముందే ఉమ్మడి గుంటూరు జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి.. భూగర్భ జలవనరుల శాఖ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది ఫిబ్రవరికి అందుబాటులో ఉన్న భూగర్భ జలాల్ని పరిశీలించి.. ఆందోళనక పరిస్థితులున్న మండలాల్లోని ప్రజలు, ప్రభుత్వ శాఖల్ని అప్రమత్తం చేసింది.
2022 ఫిబ్రవరి నాటికి సరాసరి భూగర్భ జలమట్టం 7 మీటర్లు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరికి అది 7.06 మీటర్లకు పడిపోయింది. ఎండలు పెరిగితే ఇది మరింత పడిపోయే అవకాశముంది. పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితుల్లో.. అందరూ కలిసి సొంతంగా బోర్లు వేసుకుంటూ నీటి ఎద్దడి నుంచి రక్షణ పొందుతున్నారు.
"మా గ్రామంలో నీటి సమస్య ఉంది. మా సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని మేము 20 నుంచి 30 ఇళ్ల వాళ్లం కలిసి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మా గ్రామంలో బోరు వేయించుకున్నాము."
- యడ్ల వెంకటేశ్వర్లు, రాయవరం
భూగర్భ జలాల పరిరక్షణలో భాగంగా.. పల్నాడు జిల్లాలోని 4 మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో.. బోర్ల తవ్వకంపై నిషేధం విధిస్తూ.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. ఆయా గ్రామాల్లో బోర్లు తవ్వటాన్ని నేరంగా పరిగణిస్తారు. బొల్లాపల్లి మండలంలో అత్యంత ఆందోళనకర రీతిలో.. భూగర్భజలాలు 35.63 మీటర్ల దిగువన ఉన్నాయి. ఆ తర్వాత వెల్దుర్తిలో 22.79 మీటర్లు, యడ్లపాడులో 21.39 మీటర్ల దిగువన భూగర్భజలాలు ఉన్నాయి.
గతంలో రిగ్గులు నిర్మించుకున్నవారు రెన్యువల్ చేయించుకోవడంతో పాటు.. కొత్తగా బోర్లు వేయించుకునేవారు తమ శాఖలో రిజిస్ట్రేషన్ తర్వాతే పనులు చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు. అటు.. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. పలు ప్రాంతాల్లో రక్షిత నీటి పథకాలు పడకేశాయి. వాటి వైపు ఆశగా చూడటం తప్ప గుక్కెడు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వేసవి ముందున్న వేళ.. తాగునీటి సంరక్షణ కోసం జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంది. భూగర్భ జలాలను కాపాడుకోవడంతో పాటు రక్షిత నీటి పథకాలకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది.