గుంటూరులో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని... గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలుగు ఖ్యాతిని దేశం నలుమూలలా చాటి చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీది అని తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.
మంగళగిరిలో...
మంగళగిరిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామరావు విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు.
చిలకలూరిపేటలో...
చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తెదేపా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నరసరావుపేట సెంటర్లో ఉన్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వినుకొండలో...
తెలుగుదేశంపార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... వినుకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని, ఆయన ఆశయాలు పాటిస్తూ చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు నడిపిస్తున్నారని పార్టీ నేతలు అన్నారు.
ఇదీ చదవండి:
కేసీఆర్ వ్యాఖ్యలు మీకు ఇబ్బంది కలిగించడం లేదా?: తులసి రెడ్డి