Grama Sachivalayam Employees Problems: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఆనందపడాలో.. అరకొర జీతంతో కుటుంబాన్ని ఎలా గడపాలని బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. సాప్ట్‌వేర్ వంటి ఉన్నత ఉద్యోగాలు వదులుకుని మరీ ఉన్న ఊరిలో బతుకుదామని వచ్చిన సచివాలయ ఉద్యోగులకు.. ముఖ్యమంత్రి జగన్ తీయని మాటలు చెప్పి చేతులు దులుపుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం తక్కువ మందికే వస్తుందని.. మీరు గొప్ప అదృష్టవంతులంటూ కితాబిచ్చి.. మీ ప్రాంత ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకోండంటూ నియామక పత్రాలు అందజేసిననాడే తేల్చి చెప్పారు. అరకొర జీతంతో నెట్టుకొస్తున్న సచివాలయ ఉద్యోగులపై అదనపు పనిభారం మోపుతున్నారు. చేస్తున్న ఉద్యోగంతో సంబంధం లేకుండా ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారు.
Secretariat Employees Dharna ఇక్కడ విధులు నిర్వహించలేకపోతున్నాం.. మౌన దీక్షలో సచివాలయ ఉద్యోగులు!
చెప్పిన పని చేయకుంటే తాఖీదులివ్వడం.. జీతాలు నిలిపివేస్తామని అధికారుల బెదిరింపులతో సచివాలయ ఉద్యోగులు హడలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఆర్థిక భద్రత-భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఆశతో ఉద్యోగంలో చేరిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో మంచి జీతాలు వదులుకుని సాఫీగా సాగుతున్న జీవితాన్ని ప్రభుత్వ ఉద్యోగమనే భ్రమతో చేజార్చుకున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ బాధలు భరించలేకే.. ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది ఉద్యోగాలు వదులుకుని వెళ్లిపోయారు.
సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం ఇతర పనులకు యథేచ్ఛగా వినియోగిస్తోంది. సంక్షేమ సహాయకులు, విద్య, అభివృద్ధి కార్యదర్శులకు కీలకమైన బూత్ స్థాయి ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాల్లో సవరణల పనులు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్రియాశీలకంగా ఉన్న వీరికి బీఎల్ఓ బాధ్యతలు అప్పగించొద్దని గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదు.
EMPLOYEES: సమ్మె సైరన్ మోగించనున్న.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..!
బీఎల్ఓలుగా సచివాలయాల ఉద్యోగుల నియామకంపై ప్రతిపక్ష పార్టీల అభ్యంతరాలనూ పట్టించుకోవడం లేదు. సంక్షేమ, విద్య, అభివృద్ధి కార్యదర్శులను సచివాలయాల్లోని ఖాళీ పోస్టుల్లో ఇంఛార్జ్లుగా నియమిస్తున్నారు. ఇంటిపన్ను వసూలు, ఏఎన్ఎంలతో కలిసి ఇళ్లకు వెళ్లి ప్రజారోగ్య పరిస్థితులు తెలుసుకునే బాధ్యతలూ ఇచ్చారు. వార్డు సచివాయాల్లో శానిటరీ, పర్యావరణ కార్యదర్శులకు ప్రజల నుంచి చెత్త సేకరణ వినియోగ రుసుము వసూలు బాధ్యత అదనంగా అప్పగించారు.
పైగా పుర, నగరపాలక సంస్థల కమిషనర్లు వీరికి వసూళ్ల లక్ష్యాలనూ నిర్దేశిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. వసూళ్ల లక్ష్య సాధనలో వెనుకబడినవారికి వేతనాల నుంచి జమ చేస్తామని.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కమిషనర్లు తాఖీదులిస్తుండడంతో కార్యదర్శులు బెంబేలెత్తుతున్నారు. శానిటరీ కార్యదర్శులను ఏకంగా పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించే పెద్ద మేస్త్రీలుగా మార్చేశారు.
Employees Protest Rally: సచివాలయంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ
గ్రేడ్-5 కార్యదర్శులకు 4 ఏళ్లుగా అధికారాలు కల్పించకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. క్లస్టర్ పంచాయతీల్లో పని చేస్తున్న వీరందరికీ పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలిదశలో ఎంపిక చేసిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారులో ప్రభుత్వం తొమ్మిది నెలలు జాప్యం చేసింది.
ఫలితంగా దాదాపు లక్ష మంది ఉద్యోగులు వేతనాల రూపంలో భారీగా నష్టపోయారు. ఒక్కొక్కరు నెలకు రూ.15 వేలు చొప్పున కోల్పోయారు. ఈ మొత్తాలు చెల్లించాలన్న ఉద్యోగులు విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సీపీటీ పరీక్షలో ఉత్తర్ణత సాధించలేదంటూ దాదాపు 600 మంది గ్రేడ్-5 కార్యదర్శుల ప్రొబేషన్ ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఫలితంగా నాలుగేళ్లుగా నెలకు రూ.15 వేల జీతంతోనే వారు నెట్టుకొస్తున్నారు.