గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన మల్లెల శేఖర్‌బాబు (40) రాజుపాలెం మండలంలోని ఉప్పలపాడు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు పాఠశాలలో ‘నాడు- నేడు’ పనుల్ని పర్యవేక్షించారు. సత్తెనపల్లిలో నివసిస్తున్న ఆయన 20వ తేదీ రాత్రి ఇంట్లో పడిపోగా కుటుంబసభ్యులు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలలో రక్తనాళాలు చిట్లడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన శేఖర్‌బాబు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
శేఖర్‌బాబు మృతికి గ్రామంలోని అధికార పార్టీ నాయకుల వేధింపులు, అధికారుల ఒత్తిడే కారణమని ఫ్యాఫ్టో గుంటూరు జిల్లా ఛైర్మన్ బసవలింగారావు ఆరోపించారు. 'ఉప్పలపాడు పాఠశాలలో నాడు- నేడు పనుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వేసి బిల్లులు చెల్లించాలని తల్లిదండ్రుల కమిటీ, స్థానిక నాయకులు శేఖర్‌బాబుపై ఒత్తిడి చేశారు. ఆయన ఎంఈవోకు ఫిర్యాదు చేస్తే ప్రజాప్రతినిధులతో మాట్లాడదామని మిన్నకుండిపోయారు. పని ఒత్తిడి, వేధింపులు భరించలేక శేఖర్‌బాబు మరణించాడు' అని ఆయన విలేకర్లతో చెప్పారు. ఏపీటీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, యూటీఎఫ్, ఎస్టీయూ(ఏపీ) రాజుపాలెం మండల శాఖల బాధ్యులు శ్రీనివాసరావు, రాంబాబు, సులేమాన్, పురుషోత్తం కూడా శేఖర్‌బాబు మృతికి ఒత్తిడే కారణమని ప్రకటనల్లో పేర్కొన్నారు. దీనిపై రాజుపాలెం ఎంఈవో మల్లికార్జునశర్మను సంప్రదించగా నాడు-నేడు పనుల విషయంలో ఉపాధ్యాయులకు ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయినా శేఖర్‌బాబు అలాంటి విషయాలేవీ తన దృష్టికి తేలేదన్నారు.
ఇదీ చదవండి: అమానవీయం..కరోనా మృతదేహం జేసీబీతో శ్మశానానికి తరలింపు