వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దసరా మహోత్సవాలను నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు.
అంతకు ముందు పార్టీ నాయకులతో మనోహర్ సమావేశమయ్యారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో పార్టీ నాయకులు ప్రజలకు చేసిన సేవను పవన్ కళ్యాణ్ అభినందించారన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైకాపా సర్కారు గత ఏడాది వరదల వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి లంక గ్రామాల్లో పర్యటిస్తున్నామని మనోహర్ చెప్పారు.