బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2 కోట్లు విలువైన బంగారం మాయమైంది. బ్యాంకు ఉద్యోగి సుమంత్రాజుపై బాపట్ల పట్టణ పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కావడం కలకలం రేపింది. బ్యాంకు అటెండర్ సుమంత్ రాజు 5.8 కేజీల బంగారంతో ఉడాయించాడు. దీని విలువ 2 కోట్ల 26 లక్షలు ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ రాజు బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు. బ్యాంకు అధికారులతో పాటు స్ట్రాంగ్ రూంలోకి తరచూ వెళ్లే సుమంత్.. ఆ సమయంలో ఆభరణాలు తస్కరించాడని అంటున్నారు.
ఈ నెల 2వ తేదీన బ్యాంకులో ఆభరణాల ఆడిటింగ్ జరిగినప్పుడు చోరీ విషయం బయటపడింది. ఆలోపే సుమంత్ రాజు సెలవు పెట్టి పారిపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై ఆదివారం రాత్రి ఫిర్యాదు అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సుమంత్ రాజుకు సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన బంగారాన్ని మణప్పురం ఫైనాన్సులో సుమంత్ తాకట్టు పెట్టినట్లు సమాచారం. బంగారం మాయమైన విషయం తెలుసుకుని పెద్దఎత్తున ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న బంగారం మాయం కావడంపై ఆందోళన చెందుతున్నారు.