గుంటూరు డివిజన్లో ఉదయం నుంచే ఓటర్లంతా బారులు తీరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రత్తిపాడు, పెదకూరపాడు, తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాలతో పాటు పెదకాకాని మండలం, గుంటూరు గ్రామీణ మండలాల్లో ఎన్నికలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4వ విడతలో 790 అతి సున్నిత, 217 సున్నితమైన గ్రామాలను గుర్తించిన పోలీసు అధికారులు.. ఇక్కడ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాలో మొదటి మూడు విడతల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. 4వ విడతలో 84.92 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
పెదకూరపాడు నియోజకవర్గంలో...
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండలో.. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో...
సత్తెనపల్లి నియోజకవర్గం కంటెపూడిలో పోలింగ్ కేంద్రాల వద్ద.. భారీగా ఓటర్లు బారులు తీరారు. అధికారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఓటు వేసేందుకు వస్తున్న వారికి శానిటైజేషన్ చేసి.. పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారు. లక్కరాజుగార్లపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో...
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఓటు వేసేందుకు వృద్ధులను రిక్షాపై తీసుకువచ్చారు.
ఓటు హక్కు వినియోగించుకున్న హోం మంత్రి...
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా... రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తన స్వగ్రామమైన ఫిరంగిపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోళ్లపాలెం, ఫిరంగిపురం శివారు మహిళలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హోంమంత్రి స్పందించి... సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ఉదయం 10.30 గంటలకు పోలింగ్ శాతం ఇలా