Four AP people hanged in Varanasi: వారణాసిలోని దశాశ్వమేధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనాథ్‌పూర్ ప్రాంతంలోని ధర్మశాలలోని (Cottage) ఓ గదిలో గురువారం సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. వీరంతా తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
East Godavari Family Suicide in Varanasi: ఈ కుటుంబ సభ్యులు గత రెండు నెలలుగా వివిధ ఆలయాలను సందర్శించినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం గదిలో నలుగురి మృతదేహాలు లభ్యమవ్వగా వారి గదిలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఇందులో అప్పుల గురించి ప్రస్తావిస్తూ, తమను ఇబ్బందులను గురిచేస్తున్న కొందరి పేర్లు సైతం రాసి ఉన్నాయి. ఈ విషయమై వారణాసి పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులను సంప్రదించారు.
వీరంతా కాశీ మండలం దశాశ్వమేధ ప్రాంతంలోని కైలాష్ భవన్ సత్రం రెండో అంతస్తులోని ఎస్6 రూమ్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. మృతులను కొండబాబు (50), లావణ్య (45) దంపతులతో పాటు వారి కుమారులు రాజేష్ (25), జైరాజ్ (23)గా గుర్తించారు. డిసెంబర్ 3న వీరంతా వచ్చారని.. రాజేష్ తన ఆధార్ కార్డుతో అందరికీ గదులు పొందాడని తెలిపారు. వీరంతా గురువారం ఉదయం 11 గంటలకు కాశీ నుంచి బయల్దేరి వెళ్లాల్సి ఉన్నట్లు సత్రానికి సంబంధించిన అధికారి చెప్పారు.
2నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆత్మహత్య, అదే కారణమా?
వడ్డీ వ్యాపారులతో విసిగిపోయి: కొండబాబు, అతని కుమారుడు రాజేష్ ముగ్గురి వద్ద అప్పు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. క్రమంగా వడ్డీ మొత్తం పెరిగిపోవడంతో అప్పు తీసుకున్నవారు నిరంతరం వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా కుటుంబం మొత్తం దాదాపు 2 నెలల పాటు ఇల్లు వదిలి తీర్థయాత్రలకు బయలుదేరారు. చివరిగా వారణాసి వచ్చారని తెలిపారు. అందరూ డిసెంబర్ 3న వారణాసి చేరుకుని కాశీ విశ్వనాథ ఆలయం సహా ఇతర ఆలయాలు సందర్శించి పూజలు చేశారు.
రాత్రే చెక్ అవుట్: వీరంతా రాత్రే చెక్ అవుట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే గురువారం సాయంత్రం వరకు వారి తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉన్నాయని చెప్పారు. 5 గంటల ప్రాంతంలో రూమ్‌ను క్లీన్ చేసేందుకు స్వీపర్ వచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో కిటికీలోంచి లోపలికి చూశారన్నారు. లోపలికి చూడగానే నలుగురి మృత దేహాలు వేలాడుతూ ఉండటంతో స్వీపర్ కంగారుగా కిందికి వచ్చి సమాచారాన్ని అధికారులకు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా అప్పులే కారణంగా తేల్చారు.
గదిలో పెట్రోల్ నింపిన బాటిల్స్: వీరంతా బస చేసిన గదిలో పలు వస్తువులు కూడా కనిపించాయి. గదిలో నుంచి పెట్రోల్ నింపిన మూడు బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా, గదిలో కొంత విషపూరిత పదార్థం, కొన్ని మందులు సైతం పోలీసులు కనుగొన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే కుటుంబమంతా కాశీకి వచ్చారని పోలీసులు తెలిపారు. అప్పుల వివరాలను సూసైడ్ నోట్‌లో రాశారని పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను విచారించేందుకు ఏపీ పోలీసులను సంప్రందించినట్లు తెలిపారు.
కానిస్టేబుల్ సహకారంతో వేరొకరితో భార్య సహజీవనం - పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం