Former Minister Anil Kumar Yadav Meet CM Jagan: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గవిభేదాల వ్యవహారం తాడేపల్లికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన చిన్నాన్న నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడం, పరస్పరం దాడులు చేసుకున్న స్థాయికి రావడంతో దీనిపై సీఎం జగన్ దృష్టి పెట్టారు.
విభేదాలపై ఆరా తీసిన సీఎం జగన్: ఇటీవల జరుగుతోన్న పరిణామాలు, బహిరంగ విమర్శలు దృష్ట్యా పార్టీకి నష్టం జరుగుతోందని భావించిన సీఎం.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. 45 నిముషాల సేపు పైగా అనిల్ కుమార్ యాదవ్‌తో సీఎం సమావేశమయ్యారు. నెల్లూరు సిటీలో ఆయనకు, రూప్ కుమార్‌కు మధ్య నెలకొన్న విభేదాలు, గొడవలపై సీఎం ఆరా తీశారు.
వివరణ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్: తన అనుచరుడిపై అనిల్ వర్గం హత్యాయత్నం చేసిందని రూప్ కుమార్ బహిరంగంగా ఆరోపించిన దృష్ట్యా ఆ ఘటనపైనా అనిల్‌ను సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో రూప్ కుమార్ సహా అసమ్మతి నేతల వ్యవహారం, కార్యకలాపాలపై సీఎంకు పలు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.
నెల్లూరు సిటీలో పార్టీలో విభేదాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎంకు వివరించినట్లు తెలిసింది. కొంత కాలంగా నియోజకవర్గంలో ఇరు వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తన అనుచరుడిపై అనిల్ వర్గం హత్యాయత్నం చేసిందని రూప్ కుమార్ బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్ర ఆరోపణలు చేశారు.
బహిరంగ ఆరోపణలపై సీఎం జగన్ అసహనం..!: పరస్పరం రోడ్డుకెక్కి బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు దారితీసిన పరిణామాలనూ, నియోజకవర్గంలో పరిస్థితిపైనా సీఎంకు అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
పార్టీ విజయం కోసం కృషి చేయాలి: ఇరు వర్గాల మధ్య బహిరంగ విమర్శలు, దాడులతో పార్టీ నష్టపోయే పరిస్ధితి వచ్చిందని, ఇకపై విభేదాలు పక్కన పెట్టి కలసి నడవాలని అనిల్‌కు సీఎం జగన్ సూచించినట్లు తెలిసింది. జిల్లాలో పరిస్ధితుల దృష్ట్యా పార్టీ నేతలంతా కలిసికట్టుగా నడిచి పార్టీ విజయం కోసం కృషి చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది.
అభివృద్ధి పనులకు నిధులివ్వాలన్న అనిల్: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని సీఎంను అనిల్ కోరగా.. అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. సత్వరమే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు తెలిపారు.