కరోనా మహమ్మారి గుంటూరు నగరంలో నివసించే ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. 20 రోజుల వ్యవధిలో ఐదుగురిని బలి తీసుకోగా... ఆ కుటుంబంలో మిగిలినవారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మహ్మద్ ఫరుద్దీన్ షా... కుటుంబంతో సహా A.T.అగ్రహారంలోని శ్రీరామనగర్‌లో నివసించేవారు. కుమార్తె, ఇద్దరు కుమారులకు వివాహాలు చేశారు. ఉన్నంతలో కలిసిమెలసి సంతోషంగా జీవించే ఆ కుటుంబాన్ని..కరోనా కోలుకోలేని రీతిలో దెబ్బతీసింది.
గత నెల 4వ తేదీ నుంచి 29 మధ్య ఫరుద్దీన్‌తోపాటు ఆయన కుమార్తె, తల్లి, కుమారుడు, భార్య వరుసగా అసువులు బాశారు. మరణించిన ఏ ఒక్కరూ మరొకరి మృతి గురించి తెలియకుండానే కన్నుమూయడం...ఆ కుటుంబ దుస్థితికి నిదర్శనం. చికిత్స పొందుతున్న సమయంలో చెబితే మరింత ప్రమాదమని...వారికి విషయం తెలియజేయలేదు.
ప్రస్తుతం ఫరుద్దీన్ చిన్న కుమారుడు జిలానీ కుటుంబం, వదిన గౌసియా, ఆమె పిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పచ్చని కుటుంబంలో కరోనా సృష్టించిన ఉత్పాతం నుంచి కోలుకోవడం వారికి శక్తికి మించిన పనిగా మారింది. వైద్య ఖర్చుల కోసం రూ. 20 లక్షల వరకూ అప్పు చేశారు. పుట్టెడు కష్టంలో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీచదవండి
ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం