అమరావతిలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరంతో బాధపడుతూ అనేక మంది ఇంట్లోనే ఉంటూ కుటుంబీకులకు వైరస్ వ్యాపించేందుకు కారణమవుతున్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను (సింప్టమేటిక్ కేసులు) సేకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలు అందాయి. ఈ సర్వే శనివారం నుంచి ప్రారంభించి జూన్ ఒకటో తేదీకి ముగించాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గతంలో ఐదుసార్లు సర్వే నిర్వహించారు. అందుకు భిన్నంగా ఈసారి ప్రతి సచివాలయం పరిధిలో జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించేలా ఈ సర్వేకు శ్రీకారం చుట్టనున్నారు. బాధితులకు పరీక్షలు జరిపించే బాధ్యతను ఏఎన్‌ఎంలకు అప్పగించారు. ఈసారి నిర్వహించే సర్వే చాలా పకడ్బందీగా ఉంటుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహణకు శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాచరణ రూపొందించింది. 15 మంది సూపర్‌వైజర్లను డీఎంహెచ్‌వో కార్యాలయానికి పిలిపించారు. వారిని కూడా రోజుకు ఒక్కొక్కరు 150 మందికి ఫోన్లు చేసి వివరాలు సేకరించాలని లక్ష్యాన్ని విధించారు.
ఆశా, వాలంటీర్ సంయుక్తంగా..
ప్రతి ఇంటికి వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఆశా కార్యకర్తతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్ సంయుక్తంగా వెళ్లి ఈ సర్వే నిర్వహిస్తారు. వారికి కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి ఆ సర్వే చేస్తారు. జ్వర లక్షణాలు కలిగిన వారి వివరాలు సేకరించి వీరు వెంటనే ఆ ప్రాంత ఏఎన్‌ఎంకు తెలియజేస్తారు. ఆమె వెంటనే వారికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. పరీక్షల ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ వివరాలను ఏఎన్‌ఎం సంబంధిత ప్రాంత వైద్యాధికారికి తెలియజేస్తారు. ఆ వైద్యాధికారి రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని హోంఐసోలేషన్, కొవిడ్ కేర్ సెంటర్, ట్రైఏజ్ సెంటర్, ఆస్పత్రికి సిఫార్సు చేస్తారు. సంబంధిత వ్యాధిగ్రస్థుడిని ఆస్పత్రికి తరలించే బాధ్యతను వైద్యాధికారులకే అప్పగించారు. గతంలో నిర్వహించిన సర్వేలో ఎంత మంది జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకున్నారే తప్ప వారికి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించలేదు. తాజాగా పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహణకు మూడు దశల్లో కార్యాచరణ రూపొందించామని వైద్యవర్గాలు తెలిపాయి. ఇలా చేయడం వల్ల సంబంధిత బాధితుడు బయటకు రాకుండా ఉంటారు. తద్వారా వైరస్ వ్యాప్తిని అదుపు చేయొచ్చని అంటున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగాక హోంఐసొలేషన్ కిట్ సరఫరా చేస్తారని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇలా చేయటం వల్ల బాధితుడికి మందులు, వ్యాధి నిర్వహణ పరీక్షల వ్యయాలు తప్పుతాయని, ఈ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఫీవర్ సర్వేకు సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్