Guntur Farmers problems : ఉమ్మడి గుంటూరు జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. గుంటూరు, బాపట్ల జిల్లాలో యూరియా కోసం నిల్వలు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో యూరియా అందుబాటులో లేదు. ప్రస్తుతం మొక్కజొన్న, పొగాకు పైరుకు యూరియా అవసరం కాగా అన్నదాతలు యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
జిల్లాలో సరఫరా అవుతున్న యూరియా 50 శాతం మార్కుఫెడ్, మిగిలిన 50 శాతం ప్రవేట్ దుకాణాలకు ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాలలో బస్తా గరిష్ట ధర రూ.266 ఉండగా ప్రైవేటు దుకాణాలలో రూ.300 నుంచి రూ.350 వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాలో యూరియా కొరత బాగా ఉంది. దుకాణాదారులు రైతుల నుంచి అధిక ధరలకు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక అన్నదాతలు బస్తా రూ.350 చొప్పున కొనుగోలు చేసిన ద్విచక్రవాహనంపై తరలించుకుంటున్నారు.
జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 18459 హెక్టార్లు కాగా ప్రస్తుతం 24291 హెక్టార్లలో సాగు చేశారు. జిల్లాలో 54814 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికి 36054 మెట్రిక్ టన్నులు విక్రయించారు. మార్కెట్ లో 10 వేల మెట్రిక్ తన్నులు వున్నా....కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కర్షకులకు యూరియా అందించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం లేదు. ఇంతకు ముందు కొన్న మందుల ధర 300 ఉంటే ఇప్పుడు 600 చెప్తున్నరు. మందుల కంపెనీలు ధరలు నిర్ణయించుకున్నట్టుగానే రైతులకు కూడా ధర నిర్ణయాధికారం కల్పించాలి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. - ఏదుబాటి శివయ్య, వట్టి చెరుకూరు
రెండెకరాల్లో మిర్చి, ఆరెకరాల్లో మెక్కజొన్నవేశా. యూరియా కట్టలకు చాలా కొరత ఉంది. రైతు భరోసా కేంద్రంలో యూరియా కట్ట 280 రూపాయలు, కానీ, 380 పెట్టి బ్లాక్ లో కొనాల్సి వస్తుంది. 30 కట్టలు 350 చొప్పున బ్లాక్ లో కొనడం వల్ల భారం పడింది. - నెప్పల సుబ్బారావు
పెద నందిపాడు, కాకమానూరు ప్రాంతాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాధికారులు ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాం. లేని పక్షంలో రెండు రోజుల్లో ఆందోళన తప్పదు. - రైతు సంఘం నాయకుడు
ఇవీ చదవండి :