Farmers are Worried About Cotton Price Decrease: రాష్ట్ర వ్యాప్తంగా పత్తితీతలు మొదలయ్యాయి. తెగుళ్లతో పాటు గులాబీ రంగు పురుగు భయంతో ఈ సంవత్సరం పత్తి విస్తీర్ణం 50శాతం తగ్గింది. మిర్చికి మంచి ధరలు వస్తుండటంతో అధిక శాతం రైతులు అటువైపు మొగ్గు చూపారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో పత్తికి మంచి ధరలు లభిస్తాయని రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా ధరలు తిరోగమనం దిశగా సాగుతున్నాయి. గతేడాది క్వింటాల్ 8 వేల కంటే అధికంగా పలికింది. ఈసారి 10 వేలకు చేరుకుంటుందని భావించారు. కానీ సీజన్ ప్రారంభం నుంచే మార్కెట్ మందకొడిగా నడుస్తోంది. పత్తి నాణ్యత బాగున్నా.. రేట్లు తగ్గుతుండటంపై అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
పత్తి చేలల్లో 'పులి' రాకతో పారిపోతున్న వానరాలు - ఫలించిన రైతుల ఆలోచన
ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ కనిపిస్తోందన్న సాకుతో ధరలను తక్కువగా చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తక్కువ దిగుబడులతో నష్టాలు చవిచూశామని.. మద్దతు ధర పెంచాలని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పత్తి రైతులకు బోనస్ ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు తక్కువగా (Cotton Price Decrease) ఉండడంతో సీసీఐ క్వింటాల్‌కు 7 వేల 20 రూపాయలు మద్దతు ధర నిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించింది. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు సరకు తీసుకెళ్తున్న రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ యార్డుల్లో కాకుండా ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు చేస్తుండటం అవీ దూరంగా ఉండటం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ఎక్కువ మిల్లులు గుంటూరు, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఉన్నాయి.
Kandaleru Reservoir: నెల్లూరు కనుపూరు కాలువల్లో ఆగిన సాగునీరు..అన్నదాతకు కన్నీరు
గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి రైతులంతా ఇప్పుడు అక్కడకు తీసుకెళ్లాల్సి వస్తోంది. గతంలో కంటే దూరం పెరగటంతో రవాణా వ్యయం అధికమవుతోందని రైతులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు మొత్తం పంట ఒకేసారి కాకుండా 40, 40, 20శాతం ప్రకారం మూడుసార్లు తీసుకెళ్లాలనే నిబంధనతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ సంస్థలు సంయుక్తంగా ఈ కొనుగోళ్ళ ప్రక్రియను చేపడుతున్నా.. రైతులు అవరోధాలు చవిచూస్తున్నారు. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో.. కొనుగోళ్లకు సంబంధించిన విధివిధానాలపై చర్చించి రంగంలోకి దిగినా రైతులకు అవాంతరాలు తప్పడంలేదు.
నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు.. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇంటి ముట్టడి
రైతులు సాఫీగా, స్వేచ్ఛగా పంటను విక్రయించుకునే జాగ్రత్తలను తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారు. రాష్ఠ్ర వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పింజ పొడవు, తేమ శాతం, మైక్రోనియల్ విలువ తదితర నాణ్యతా ప్రమాణాలతో పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తేమశాతం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే గరిష్ఠ ధరలు పొందవచ్చని సూచిస్తున్నారు. తమ అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా కొనుగోలు నిబంధనలు రూపొందించారని ఫలితంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పత్తి రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా వాటిని మార్చాలని కోరుతున్నారు.