Family Members are Worried About Chandrababu Security: స్కిల్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలచివేస్తోందని నారా భువనేశ్వరి అన్నారు. జైలులో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తాము మొదటి నుండి ఆందోళనలను వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆ జైలు గోడల వెనుక తన భర్త భద్రత కోసం ప్రార్థిస్తున్నా అన్నారు. రాష్ట్ర సోదరీమణులు అంతా తన ప్రార్ధనలో భాగస్వాములు కావాలని కోరారు. చంద్రబాబుపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసులేనని స్పష్టం చేశారు. భద్రతా సమస్యలను వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ తీవ్ర ఆందోళనకు గురి చేసిందని నారా బ్రాహ్మణి తెలిపారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అన్నారు.
Achchennaidu on Chandrababu Security: జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్, అతని బృందం సిద్ధహస్థులని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేసిన సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమకు ఆందోళన కలుగుతోందని చెప్పారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదని మండిపడ్డారు. జైల్ లోపల నుంచి ఫొటోలు వస్తున్నా ఎలాంటి చర్యల్లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉంటే ప్రభుత్వానికేం సంబంధమని నిలదీశారు. సజ్జల డైరెక్షన్లో మొత్తం వ్యవహరం నడుస్తుండడం కూడా తమకు మరింత ఆందోళన కలుగుతోందన్నారు. గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశ్యాలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చాలా వరకు బరువు తగ్గారన్నారు.
TDP Leaders on Chandrababu Security: చంద్రబాబును ఎక్కువ కాలం జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని వైసీపీ కుట్ర పన్నిందని మాజీమంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. జగన్ జేబు వ్యవస్థల ద్వారా చంద్రబాబు అరెస్ట్ చేశారని జైలులో హింసిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు నారా భువనేశ్వరి ప్రజల్లోకి వస్తే వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని జగన్ జైల్లో వున్నప్పుడు విజయమ్మ, షర్మిల ప్రచారం చేసిన విషయం గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ మంత్రులు పిచ్చి కుక్కల్లా ప్రవర్తిస్తున్నారని పోలీసులు లేకపోతే వారు కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతను జైలు అధికారులు, ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.