Express Highways Construction in AP: ఉత్తరప్రదేశ్ అనగానే మనకు కనీస మౌలిక వసతులకు దూరమైన బిమారు రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తుకు వస్తుంది. ఐతే ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం రహదారులను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. ఆగ్రా-లక్నో, చాంద్‌సరాయ్-హయ్‌దరియా పూర్వాంచల్, చిత్రకూట్-ఇత్వాహ్ బుందేల్‌ఖండ్, గ్రేటర్ నోయిడా-ఆగ్రా యమున, దిల్లీ-మీరట్, లక్నో-కాన్పూర్ వంటి ఎక్స్‌ప్రెస్ హైవేల్ని నిర్మిస్తూ అందుబాటులోకి తెస్తోంది.
కానీ మన రాష్ట్రంలో జరిగిందేంటి? చెప్పేందుకు కనీసం దారీతెన్నూ లేని పరిస్థితి. ఉత్తరాదితో పాటు పొరుగు రాష్ట్రాలు పోటీపడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రోడ్లు మంజూరు చేయించుకుని నిర్మాణంలో పోటీపడుతున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నిద్రావస్థలోనే ఉంది. మన రాష్ట్రంలో ఆరు ఎక్స్‌ప్రెస్ రహదారులు ఉన్నాయి.
విజయవాడ-నాగ్‌పూర్, విశాఖపట్నం-రాయ్‌పూర్, చిత్తూరు-తచ్చూరు, చెన్నై-బెంగళూరు, సూర్యాపేట-దేవరపల్లి, సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుంటే ఇందులో ఐదింటి వల్ల మన రాష్ట్రానికి ఒనగూరేదేమీ లేదు. విజయవాడ-నాగ్‌పూర్ మధ్య 405 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తుంటే ఇందులో రాష్ట్ర పరిధిలో 30 కిలోమీటర్లే ఉంది.
జాతీయ రహదారి విస్తరణలో జాప్యం - కొన్నిచోట్ల కిలోమీటర్ కూడా పూర్తి చేయని కాంట్రాక్టర్లు
రాయ్‌పూర్-విశాఖ మధ్య 464 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ రహదారిలో మన రాష్ట్రం గుండా వెళ్లేది 100 కిలోమీటర్లు మాత్రమే. విశాఖ పోర్టుకు సరుకు రవాణా కోసం నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకే ప్రయోజనం కలగనుంది. మన రాష్ట్ర పరిధిలో రెండు నగరాలు, రెండు ప్రాంతాల మధ్య సులభతర రవాణాకు ఒక్క ఎక్స్‌ప్రెస్ రహదారైనా లేదు.
పొరుగున ఉన్న కర్ణాటకలో బెంగళూరు-మైసూరు మధ్య పాత హైవే కాకుండా 119 కిలోమీటర్ల మేర పది వరుసలతో యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వే(Access Control Express Way)ని గతేడాది అందుబాటులోకి తెచ్చారు. దీంతో గతంలో మూడు, నాలుగు గంటలున్న ప్రయాణ సమయం ఇపుడు గంటన్నరకు తగ్గింది. విజయవాడ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, అనంతపురాలకు వేగంగా చేరుకునేలా ఒక్క ఎక్స్‌ప్రెస్ రహదారినీ జగన్ ప్రభుత్వం సాధించలేదు.
గత ప్రభుత్వంలో మంజూరైన విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద రెండు ఆర్ఓబీలు, దుర్గమ్మ ఆలయం వద్ద కనకదుర్గ ఫైఓవర్ పూర్తిచేసి అదే తమ గొప్పతనమని జబ్బలు చరుచుకుంటోంది. గత టీడీపీ ప్రభుత్వం కేందంపై ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ జిల్లాలకు మేలు కలిగేలా 384 కిలోమీటర్ల మేర అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరుచేయించి, డీపీఆర్ సిద్ధం చేయించి హైవే నెంబర్ కేటాయించేలా చూసింది.
గుంతల రోడ్లపై 'ఆడుదాం ఆంధ్ర' - మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన
జగన్ సర్కారు వచ్చాక దీనిని మరుగునపెట్టింది. ఈ రహదారి స్థానంలో పులివెందుల నియోజకవర్గం మీదుగా వెళ్లేలా కొడికొండ-మేదరమెట్ల రహదారిని తెరపైకి తెచ్చింది. అమరావతి చుట్టూ ఔటర్‌రింగ్ 189 కిలోమీటర్ల రింగ్‌రోడ్‌ను గత ప్రభుత్వం మంజూరు చేయిస్తే, దీనిని కూడా పక్కనపెట్టింది. ఆ స్థానంలో 40 కిలోమీటర్ల మేర విజయవాడ తూర్పు బైపాస్ నిర్మిస్తే చాలంటోంది.
విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై, విజయవాడ-హైదరాబాద్ మార్గాల్లో నిరంతరం వాహన రద్దీ అధికంగా ఉంటోంది. అయినాసరే ఈ నాలుగు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ హైవేల కోసం జగన్ ప్రభుత్వం కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి ఉన్నప్పటికీ ఇది పూర్తిస్థాయిలో ఆరు వరుసలుగా కూడా లేదు.
మూడు రాజధానులంటూ నాలుగేళ్లుగా హడావుడి చేస్తున్న సీఎం జగన్‌కు విజయవాడ-విశాఖపట్నం మధ్య కొత్తగా ఎక్స్‌ప్రెస్ రహదారి కోసం ఆలోచన చేయకపోవడం, కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడం చూస్తే రహదారుల అభివృద్ధిపై ఆయనకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రస్తుతమున్న జాతీయ రహదారిలో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఈ హైవేని ఆనుకుని అనేక గ్రామాలు, మండల కేంద్రాల్లో నిర్మాణాలు పెరిగిపోయి వేగంగా ప్రయాణించే అవకాశం లేకుండాపోయింది.
రెండేళ్ల కిందటే దీనిని ఆరు వరుసలుగా చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం ఏపీ, తెలంగాణ రాజధానులను అనుసంధానం చేస్తూ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాల్సి ఉంది. 31 మంది ఎంపీలు ఉండి పార్లమెంట్‌లో నాలుగో పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ తెచ్చిందేమిలేదు. పొరుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ రహదారులపై వాహనాలు దూసుకుపోతుంటే మాకెందుకు అటువంటివి మంజూరు చేయరని గట్టిగా కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం ఒక్కసారైనా చేసి దాఖలాల్లేవ్.
రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక