ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన ప్రథమ జాతీయ స్థాయి పద్యనాటక పోటీలు ముగిశాయి. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పాల్గొన్నారు. ఆర్ నారాయణమూర్తి తన మాటలతో, పద్యాలు, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
కళల కాణాచి తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి నగదుతో పాటు.. స్వర్ణ, రజిత, కాంస్య వీణలను బహుకరించారు.
ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం చూస్తోందని సినీ నటుడు నారాయణమూర్తి మండిపడ్డారు. కొవిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడి భరోసా ఇవ్వాలే తప్ప.. భయపెట్టకూడదన్నారు. డాక్టర్లు సైతం కరోనా పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని ఆక్షేపించారు. తెనాలి గడ్డ గురించి మాట్లాడుతూ ఇక్కడ పుట్టిన ప్రఖ్యాత నటులు గురించి.. వారి పోషించిన పాత్రల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ, నిర్వాహకులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైకాపాలోకి బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ