Electoral Observers Appointed in AP: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా తనిఖీ కోసం ఎలక్టోరల్ అబ్జర్వర్లను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ రూపకల్పన, తనిఖీ తదితర ప్రక్రియల కోసం అయిదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు జే. శ్యామల రావును నియమించారు.
ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు బి.శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎన్.యువరాజ్‌ను నియమించారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పోల భాస్కర్‌ను.. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు డి.మురళీధర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మూడు సార్లు జిల్లాలో పర్యటించాలి: 2024 ఓటర్ల జాబితా సిద్ధం చేసేలోగా మూడు సార్లు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలని అబ్జర్వర్లకు ఆదేశాలు ఇచ్చారు. అభ్యంతరాల గడువు పూర్తి అయ్యే డిసెంబర్ 9వ తేదీ లోగా మొదటి దఫా, వాటిని ఈఆర్వోలు సరిదిద్దే గడువు 26 డిసెంబర్ లోపు 2వ దఫా పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు. జాబితాను తుది తనిఖీ కోసం 2024 జనవరి 4 తేదీలోగా మూడో సారి పర్యటించాల్సిగా ఈసీ సూచనలు జారీ చేసింది. తొలి పర్యటనలో ఓటర్ల జాబితా రూపకల్పనపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలని సూచనలు చేసింది.
ఓటరు జాబితా రూపకల్పనలో వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఓటర్ జాబితా రూపకల్పనకు సంబంధించి సాధారణ ప్రజలు కూడా రోల్ అబ్జర్వర్లను కలిసి ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలియజేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎలక్టోరల్ అబ్జర్వర్లను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు - మౌనం వహించిన ఎన్నికల సంఘం!
మరోవైపు రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారం, నకిలీ ఓట్లు, ఒకే ఇంటి నెంబర్‌తో పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం గత కొద్ది నెలలుగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పటికే పలువురు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
పర్చూరులో నలుగురుపై చర్యలు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై కోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు. ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. అధికారులను అడ్డుపెట్టుకొని ఓట్లను తొలగిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో సైతం ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారు.