Election Commission Released Voters List: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం.. గురువారం తుది జాబితాను ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో లక్షా 30వేల728 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది నవంబరు 9న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 3కోట్ల 98లక్షల 54వేల 93 మంది ఓటర్లు ఉండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఓటర్ల సంఖ్య 3కోట్ల 99లక్షల 84వేల 868కు చేరింది. సమగ్ర సవరణ అనంతరం రాష్ట్రంలో నికరంగా 0.33% ఓటర్లు పెరిగారు. కొత్తగా 5లక్షల 97వేల701 మంది ఓటర్లను .. ఎన్నికల సంఘం చేర్చింది. 4 లక్షల 66వేల 973మందిని తొలగించింది. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4లక్షల 61వేల 966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో అల్లూరి జిల్లా: తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 17 జిల్లాల్లో పెరగ్గా.. 9 జిల్లాల్లో తగ్గింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 30వేల 824 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 15వేల 690 మంది, బాపట్ల జిల్లాలో 13 వేల 678 మంది ఓటర్లు తగ్గారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో.. 28వేల579 మంది, అనంతపురం జిల్లాలో 27వేల 464 మంది, నంద్యాలలో 18వేల 270 మంది ఓటర్లు పెరిగారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాల్లో కర్నూలు మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో అల్లూరి జిల్లా తొలి స్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా రెండోస్థానంలో ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16వేల 162 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 7వేల 63 మంది, విజయనగరంలో 5వేల 460 మంది, బాపట్లలో 4వేల821 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో 390 మంది ఉన్నారు.
రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో విశాఖ జిల్లాలోని భీమిలి, గాజువాక మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం మూడో స్థానంలో ఉంది. అతి తక్కువ ఓటర్లున్న జాబితాలో మొదటి మూడు స్థానాల్లో కృష్ణా జిల్లా పెడన, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట ఉన్నాయి.
ప్రతిపక్షపార్టీల సందేహాలు: మరోవైపు మూడేళ్ల కిందట రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య కంటే ఇప్పటి ఓటర్ల సంఖ్య.. బాగా తగ్గిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై టీడీపీ సహా ప్రతిపక్షపార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో జాబితాలో కొత్తగా చేర్చిన, తొలగించిన ఓట్లపై మూడోపక్షంతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండు చేస్తున్నాయి. వైసీపీ నాయకులు, వాలంటీర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కై తమ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగించారంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలు వెలుగుచూశాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీ నుంచి అధికారులను పంపించి విచారణ జరిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగానూ సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో ఎక్కువ ఓట్లు తీసేశారని.. దీనివల్ల తుది జాబితాలో ఆయా జిల్లాల్లో ఓటర్ల సంఖ్య బాగా తగ్గిపోయిందని.. ఇవన్నీ తమకు బాగా పట్టున్న జిల్లాలని, ఉద్దేశ పూర్వకంగానే అక్కడ ఎక్కువగా ఓట్లు తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది. కర్నూలు,నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరగటంపైనా ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
వాళ్లే ప్రధాన సూత్రధారులు: ప్రతిపక్షపార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపులో వాలంటీర్లే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారు. ఓటర్లజాబితా నుంచి ఎవరిపేరైనా తొలగించాలంటే ఆ వ్యక్తికి లేదా వారి కుటుంబసభ్యులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. వారు సమాధానమిచ్చాక, అది సహేతుకంగా లేకపోతేనే తొలగించాలి. టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన ఓటర్లకు నోటీసులు ఇవ్వకుండా, వారికి తెలియకుండానే ఓట్లు తొలగించేశారు. మరికొన్నిచోట్ల నకిలీ సంతకాలతో తొలగింపు కోసం దరఖాస్తులు పెట్టారు. వాలంటీర్లే ఈ తొలగింపునకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారు. ప్రధానంగా వలస ఓటర్లు, డూప్లికేట్ ఓటర్ల పేరిట ఎక్కువ మందిని తీసేశారు. ఏడాదిలో కొత్తగా 8,39,164 మంది ఓటర్ల జాబితాలో చేరారు. వీరిలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులేనన్న ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి: