వేసవి సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని డెల్టా ప్రాంతాల్లోని చెరువులను.. కృష్ణానది నీటితో కాలువల ద్వారా నింపుతున్నారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని సంబంధిత అధికారులు కార్యాచరణ రూపొందించి ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. దాదాపు 90 శాతం చెరువులను నీటితో నింపేశారు. అయితే దూర ప్రాంతాలకు నీరు తీసుకెళ్లే 3 ప్రధాన కాల్వల్లో నీరు కలుషితమవుతోంది.
నీరు నది నుంచి పల్లెల్లోని చెరువులకు చేరే క్రమంలో.. మధ్యలో మురుగునీరు కలుస్తోంది. పట్టణంలోని జేఎంజే కాలేజీ, వైకుంఠపురం సమీపంలోని రేపల్లెకు వెళ్లే రైలు వంతెన కింద.. నేరుగా డ్రైనేజీ నీరు పంట కాలవల్లో కలుస్తోంది. జగ్గడిగుంట పాలెం దగ్గరా ఇదే పరిస్థితి.
అధికారులు మాత్రం ఇది ఒక్కరితో తీరే సమస్య కాదని, డెల్టా పరిధిలోని అధికారులందరూ కూర్చుని కసరత్తు చేయాలని చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై లేఖల రూపంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని..గ్రామాల్లో కూడా చెత్తా, చెదారం కాలువల్లో వేయకుండా అవగాహన కల్పిస్తున్నామని వివరిస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి ప్రధాన కాల్వల్లో మురుగునీరు కలవకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని డెల్టా పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గుప్త నిధుల కోసం వేట- ఊపిరాడక ఇద్దరు మృతి