Krishna Ella Warning On Another Pandemic: భవిష్యత్తులో మరో మహమ్మారి పొంచి ఉందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో.. ఈసారి జంతుజాలం నుంచి విపత్తు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ - 2022కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయంలో భారతీయ వెటర్నరీ పాథాలజీ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న 39వ అంతర్జాతీయ సదస్సును డాక్టర్ కృష్ణ ఎల్ల ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి సదస్సుకు హాజరైన 450 మంది పైగా పశువైద్యులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచంలో.. ప్రత్యేకించి భారత్‌లో పశువులు, కోళ్లు, చేపలలో కలిగే వ్యాధులు, సమస్యలు, త్వరిత వ్యాధి నిర్థారణ, మానవాళికి కలిగే ఉపయోగాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు.
సాధారణంగా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే మహమ్మారులు.. విపత్తుల ప్రమాదాలను హెచ్చరిస్తూ ప్రకృతి సందేశాలు ఇస్తుందని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. కానీ, మనం అవి అర్థం చేసుకుని అప్రమత్తం కాకుండా నిర్లక్ష్యం వహిస్తుండటం వల్లే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇకనుంచైనా మానవ వైద్యులు, పశు వైద్యులు, పాథాలజిస్టులు, పరిశోధన సంస్థలు.. పూర్తి సమన్వయంతో పనిచేయడం ద్వారా భవిష్యత్తు ఎదురయ్యే సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో ఆస్థి, ప్రాణ నష్టంతోపాటు ఆహార, పౌష్టికాహార భద్రత ముప్పు నుంచి బయటపడవచ్చని డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ పశువైద్య శాస్త్రం విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీఎన్ త్రిపాఠి, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీన్ డాక్టర్ టి.రఘునందన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
"భవిష్యత్తులో మహమ్మారి జంతువుల్లో వచ్చే అవకాశం ఉందని నా అంచనా. ఎందుకు అలా అంటున్నానంటే స్వైన్ ఫీవర్, బర్డ్‌ఫ్లూ వంటి ద్వారా ప్రకృతి మనకు సంకేతాలు ఇచ్చింది. కొవిడ్ మహమ్మారికి ముందు 2019 డిసెంబరు 5న బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో నేను ప్రసంగించాను. కొవిడ్ వెలుగులోకి వచ్చే మూడు నెలల ముందు. ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు ఇచ్చింది. సార్స్ కోవ్, ఎబోలా వంటి సంకేతాలు వచ్చాయి. కానీ మనం పట్టించుకోలేదు. జంతువుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, లంపీ స్కిన్ వంటి ద్వారా మరోసారి మనకు సంకేతాలు అందుతున్నాయి. మరో ముప్పు పొంచి ఉందని ప్రకృతి హెచ్చరిస్తోంది. ఆ ముప్పు ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆ మహమ్మారి ప్రభావం మనుషులపైనే కాకుండా మొత్తం జీవనాధారాలను దెబ్బతీస్తుంది." - డా. కృష్ణ ఎల్ల భారత్ బయోటెక్ ఛైర్మన్
ఇవీ చదవండి: