వరద ప్రాంతాలనూ పర్యవేక్షిస్తున్నట్లే చంద్రబాబు నివాస పరిసరాలను డ్రోన్లతో చిత్రీకరించామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్‌యాదవ్ తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవని... దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని తెదేపా నేతలకు సూచించారు. ఒకేసారి నీళ్లు నింపి చంద్రబాబు నివాసం మీదకు వదలారన్న ఆరోపణలను అనిల్ ఖండించారు. కొందరికి వరద నిర్వహణ సరిగా తెలియదని అంటున్న మాటలకు మంత్రి ఖండించారు. కరకట్టపై ఇల్లు కట్టి నీళ్లు వదలొద్దని చెప్పడం సరికాదన్నారు. తెదేపా నేతలు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బదులిచ్చారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ చక్కర్లు కొట్టిందని ఆరోపిస్తున్నారని...అందులో వాస్తవం లేదని కొట్టేశారు. అన్ని వరద ప్రాంతాలను డ్రోన్‌తో పర్యవేక్షిస్తున్నామని... అలాంటప్పుడు భద్రతకు ఎలాంటి ముప్పు ఉంటుందో చెప్పాలన్నారు. శ్రీశైలం నిండాక ఒకేసారి నీళ్లు వదిలితే 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేది కాబట్టి.. అధికంగా వచ్చిన వరదను క్రమంగా వదులుతున్నామని తెలిపారు. మేము సరిగ్గానే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని... తగు కార్యాచరణను సరిగ్గానే నిర్వహిస్తున్నామన్నారు. రైతులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తొలుత 50 వేల క్యూసెక్కుల నీరు వదిలామని... తర్వాత మెల్లగా పెంచుకుంటూ లక్ష, 2 లక్షలు.5 లక్షల క్యూసెక్కులను వదిలామని తెలిపారు. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వరదల ఆధారంగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు.
పోలవరానికి రీటెండరింగ్ తప్పదు
నవంబర్ 1 నుంచి పోలవరం పనులు మొదలుకానున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం రీటెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదివరకు పనులు చేపట్టిన నవయుగ సంస్థ కూడా పాల్గొనవచ్చన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటమే మా లక్ష్యమని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై దృష్టి పెడతామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టమిచ్చారు.