Dog Show Carnival at Peoples Plaza : పెంపుడు కుక్కలను చాలా మంది కన్న బిడ్డల్లా చూసుకుంటారు. మనుషులకు అందాల పోటీలు పెట్టినట్లే కుక్కలకూ పోటీలు ఉంటాయి. అలాంటి ఓ కార్యక్రమాన్ని తెలంగాణ కనీన్ అసోసియేషన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగర నలుమూలల నుంచి పెంపుడు కుక్కలను ప్రజలు తీసుకొని వచ్చారు.
బ్రీడుల వారీగా మొదటి రౌండ్లో పోటీ పెట్టగా, రెండో రౌండులో అన్ని బ్రీడ్లకు కలిపి తిరిగి పోటీ నిర్వహించారు. చిన్న కుక్కలైన చువావా, పొమేరియన్లతో పాటుగా జెర్మన్ షెపర్డ్, గ్రేట్ డేన్ వంటి పెద్ద కుక్కలు కూడా కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాయి. ముద్దు ముద్దుగా నడుస్తూ, అరుస్తున్న శునకాలను చూసి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ కేరింతలు కొట్టారు. కొందరు ఇంతకు ముందే డాగ్ షోలలో పాల్గొన్నవారైతే, మరికొందరు మొదటిసారి తమ కుక్కలను తీసుకొచ్చి ఒక కొత్త అనుభూతిని పొందారు.
శునకాలను కూర్చోమంటే కూర్చోటం.. నిల్చోమంటే నిల్చోడం వంటివి చూసే ఉంటాం. అలాగే పిల్లులకు శిక్షణా పోటీలు ఉంటాయి. రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పిల్లుల పోటీలు ఆకర్షణగా నిలిచాయి. అందాల పోటీలతో సహా క్యాట్ వాక్ పోటీలు కూడా జరిగాయి. కేవలం పోటీలకు మాత్రమే పరిమితం కాకుండా కుక్కలకు, పిల్లులకు కావాల్సిన పౌష్ఠికాహారం, వాటికి డిజైనర్ బట్టలు, ఆడుకోటానికి బొమ్మలు.. ఇలా పలు స్టాల్స్‌ను కూడా కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
వచ్చిన కుక్కలకు జడలు వేసి అందంగా తయారు చేసే స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు పలు ఎగ్జాటిక్ జంతువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. బ్రెజిలియన్ మకావులు, గుర్రాలు, టరాంటుల సాలీడులు పైతాన్ పాములతో సహా పలు జంతువుల ప్రదర్శన ఆకట్టుకుంది. పాఠశాలల విద్యార్థులు సందడి చేశారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ డాగ్ షోలో నగర వాసులు తమ పెంపుడు కుక్కలతో సందడి చేస్తున్నారు. శునకాలను అలంకరించి అందంగా తయారు చేసి, కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇవీ చదవండి: