Lack of Facilities in the Temple Built by TTD in Amaravati: తిరుమల శ్రీవారి ఖ్యాతి దశదిశలా వ్యాపింపజేయడం సహా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు గత ప్రభుత్వం రాజధానిలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఏడు కొండలపై ఉన్న శ్రీవారి ఆలయాన్ని పోలిన గుడిని నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి.. నిధులు కేటాయించింది. కృష్ణానదికి అభిముఖంగా సచివాలయం, హైకోర్టు తదితర కీలక ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఆలయ నిర్మాణం చేపట్టారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని పక్కన పెట్టింది. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన సర్కారు.. టీటీడీ నిధులతో నమూనా ఆలయాన్ని పూర్తి చేసింది. సకల సదుపాయాలతో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను మార్చివేసి.. తక్కువ విస్తీర్ణంలో శ్రీవారి గుడిని నిర్మించారు. తిరుమల కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి రూపాన్నే ఇక్కడ ప్రతిష్ఠించడంతో భక్తుల రాక పెరిగింది.
గుడిలోని శ్రీవారి మూలవిరాట్టు విశేషంగా ఆకట్టుకుంటోంది. సచివాలయానికి వెళ్లే అధికారులు, సిబ్బంది రోజూ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాజధాని గ్రామాల్లోని వెంకటపాలెం సమీపంలో శ్రీవారి ఆలయాన్ని 5 ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం తలపెట్టింది. ఆలయ సమీపంలో భారీగా పచ్చదనం పెంపుతో పాటు.. రవాణా సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రచించింది. విజయవాడ , గుంటూరు నుంచి ఆలయం మీదుగా బస్సులు నడిపేందుకు సీడ్ ఆక్సిస్ రోడ్డు చేపట్టింది. దీన్ని వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది. ఫలితంగా దేవాలయానికి వచ్చేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, ఇతర వాహనాల్లో అధిక మొత్తం చెల్లించి గుడికి వస్తున్నారు.
ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చునేందుకు కనీస సదుపాయాలను ప్రస్తుత ప్రభుత్వం కల్పించలేదు. విశ్రాంతి భవనాలు లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలదాచుకునే అవకాశం లేకుండా పోయింది. వీటితో పాటు ఆలయంలో కేవలం స్వామివారి సర్వదర్శనాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. తిరుమల తరహాలో ఆర్జిత సేవలను ఇంకా ప్రారంభించలేదు. దీని వల్ల చాలా మంది భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
రాజధాని ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. దానిని ప్రజలకు తెలిసేందుకు ధార్మిక ప్రచారం చేయడం లేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉన్నా అలా చేయకపోవడం వల్ల ఆలయ విశిష్టత తెలియడం లేదంటున్నారు.
"దూరం నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఉండాలి అనుకుంటే.. వసతి సౌకర్యాలు లేవు. అదే విధంగా వచ్చే మార్గంలో ఆలయానికి దారి చూపించేందుకు బోర్డులు పెడితే బాగుంటుంది". - భక్తుడు
ఇవీ చదవండి: