కేవలం 5 నెలల్లోనే దేశంలో ఇంత చెడ్డపేరు మూటగట్టుకున్న ఘనత... వైకాపా ప్రభుత్వానిదేనని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో తెలుగుదేశం పార్టీ గ్రామ నూతన కమిటీల ఎన్నిక బుధవారం నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా మాజీమంత్రి దేవినేని ఉమా హాజరై ప్రసంగించారు.
వైకాపా ప్రభుత్వం కోడెలను అన్యాయంగా బలితీసుకుందని దేవినేని ఆరోపించారు. పల్నాడుకు ఎవరినీ వెళ్లకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున తాను సన్న బియ్యంపై ప్రశ్నిస్తే... కొడాలి నాని నీచ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంపైనా... కొడాలి నాని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. అధికారం ఉందనే అహంకారంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ మోహన్‌రెడ్డి అమరావతిలో ఉండి... అక్కడే గోతులు తవ్వుతున్నారని విమర్శించారు. అసలు అమరావతి కడతారో లేదో జగన్ చెప్పాలని నిలదీశారు. వైకాపా మంత్రులు సంస్కారంతో... తెలుగుబాష నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా కులాలు చూసిన ఘనత ఒక్క జగన్ ప్రభుత్వానికే దక్కిందని దేవినేని ఉమ ఆరోపించారు.