వైకాపా ఎంపీ నందిగం సురేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందని(threat from MP Nandigam Suresh), రక్షణ కల్పించాలని అమరావతి దళిత ఐకాస నేత పులి చిన్నా భార్య సువార్త తుళ్లూరు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆమె అమరావతి ఐకాస నేతలు, మహిళలు, రైతులతో కలిసి తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌కు సోమవారం వినతి పత్రం(Dalit leader chinna wife request to police) అందించారు. పులి చిన్నాపై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి నిరసనగా అమరావతి ఐకాస నేతలు, మహిళలు, రైతులు తుళ్లూరు దీక్షాశిబిరం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం సీఐకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సువార్త మాట్లాడుతూ ‘ఉద్దండరాయునిపాలెంలో అమరావతి ఉద్యమ శిబిరం ఏర్పాటు నుంచి ఎంపీ నందిగం సురేష్ వర్గం మా కుటుంబంపై కక్ష పెంచుకుంది. కొన్ని రోజులుగా మేం బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం.
రాత్రుళ్లు ద్విచక్రవాహనాలపై మా ఇంటి చూట్టూ ఎంపీ అనుచరులు తిరుగుతూ భయపెడుతున్నారు. భూములు కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తిని ఎంపీ అనుచరులు పులి మోజెస్, పులి సురేష్, పులి మాణిక్యాలరావు, పులి దాసు రక్తం కారేలా కొట్టారు. ప్రభుత్వ ఒత్తిడితో నా భర్తకు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలోనూ సరైన చికిత్స అందించడం లేదు. నా భర్తపై దాడి చేసిన వారిని శిక్షించి మాకు న్యాయం చేయాలి’ అని సీఐకి చేతులెత్తి మొక్కి వేడుకున్నారు. ఐకాస నాయకులు పువ్వాడ సుధాకర్, దళిత ఐకాస కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ తదితరులు మాట్లాడుతూ ..పులి చిన్నాపై దాడి చేసిందే కాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిపై తిరిగి నిందితులే కేసులు పెట్టడం దారుణమన్నారు.
- మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు సోమవారం 643వ రోజు కొనసాగాయి. రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు తుళ్లూరు శిబిరానికి చేరుకొని నిరసనల్లో పాల్గొన్నారు.
పులి చిన్నాను పరామర్శించిన చంద్రబాబు
రాష్ట్రంలో రౌడీయిజం పరాకాష్ఠకు చేరిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(tdp leader chandrababu) విమర్శించారు. విజయవాడ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత ఐకాస కోకన్వీనర్ పులి చిన్నాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి కోసం పోరాడుతున్న చిన్నాపై దాడి చేసిన వారిపై బెయిలబుల్, బాధితుడిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలకు ప్రాణాపాయమేర్పడితే ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏకపక్షంగా తప్పుడు కేసులు పెట్టుకుంటూపోతే నైతిక, ప్రజాబలంతో ఎదుర్కొంటామన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తదితరులున్నారు.
ఇదీ చదవండి..
ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం