Congress War Room Case: తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మరో కాంగ్రెస్ నేతకు సైబర్‌క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు అందాయి. సీనియర్ నేత మల్లు రవికి సీఆర్పీసీ 41ఏ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కనుగోలు ఇవాళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సునీల్ కనుగోలును విచారించారు. వార్ రూమ్ విషయాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లపై వివరాలు సేకరించారు. మరోసారి విచారణకు పిలుస్తామని సునీల్‌కు తెలిపారు.
అసలు విషయం ఇదీ..: ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 14న పోలీసులు.. హైదరాబాద్ మాదాపూర్‌లోని సునీల్ కార్యాలయంలో సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 30న విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
అయితే అప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయవద్దని, 8న సునీల్ విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు నిన్న విచారణకు రావాల్సి ఉండగా, ప్రత్యేక అభ్యర్థనతో ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకొచ్చారు. నేతలను కించపర్చటంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం, కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో లభ్యమైన సమాచారం మేరకు పోలీసులు సునీల్‌ను ప్రశ్నించారు.
ఇవీ చూడండి..