CRDA Notices to Amaravati Farmers: రాజధాని అమరావతిపై ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపిందని అమరావతి రైతులు, ఐకాస నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి గతంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో (Amaravati Land Pooling) తీసుకున్న భూముల్లో కేటాయించిన ప్లాట్లను రాజధాని రైతులు రద్దు చేసుకోవాలంటూ సీఆర్డీఏ (CRDA) నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది.
వ్యక్తమవుతున్న అనుమానాలు: వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని ఆ నోటీసులలో ఉంది. శనివారం రోజు పలువురు రైతులకు ఈ విధమైన నోటీసులు అందాయి. అయితే ఇందులో అమరావతిని నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉందంటూ అమరావతి ఐకాస నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను ఇచ్చారు. అయితే కొంత మంది రైతులు ఇవ్వడానికి విముఖత చూపారు. దీంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న ప్రణాళికతో ఉన్న నాటి తెలుగుదేశం ప్రభుత్వం.. ఆ కలను సాకారం చేసేందుకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించింది.
ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధరను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్ పూలింగ్ భూముల్లో అమరావతికి భూములను ఇచ్చిన రైతులకు స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే ఈ లోపు ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి గానీ.. అవసరాలకు అమ్ముకోవడానికి గానీ లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకొంటున్నారు.
అలా అయితే అమరావతి విచ్ఛిన్నం: ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ (Capital Region Development Authority) ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లను రద్దు చేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని లేఖలు పంపిస్తోంది. కేటాయించిన ప్లాట్లను రద్దు చేసుకుంటే భూములను ఇవ్వని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమరావతి నిర్మాణం విచ్ఛిన్నం అవుతుందని రైతులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
తొందరపడి సంతకాలు చేయొద్దు..: సీఆర్డీఏ నుంచి వచ్చిన లేఖలను తీసుకున్నా, తొందరపడి వాటిపై ఎవరూ సంతకాలు చేయొద్దని రాజధాని రైతులకు అమరావతి సమన్వయ కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఇటువంటి సమయంలో ప్లాట్లను రద్దు చేసుకుంటే వేరేచోట ఇస్తామని చెప్పడంపై అనుమానాలున్నాయని అంటున్నారు. భూ సమీకరణకు విముఖత చూపిన రైతులకు వారి భూములను తిరిగి ఇచ్చేస్తే అమరావతి ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రైతులందరితో సమావేశం నిర్వహించి, న్యాయవాదుల సలహాలు, సూచనల మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని అమరావతి ఐకాస నాయకులు ప్రకటించారు.