కరోనా నివారణ చర్యలపై సమీక్షించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్.... కొత్తగా ఐదో విడత లాక్ డౌన్ నిబంధనలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. కంటైన్మెంట్ జోన్ల వరకు ఐదో విడత లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఇకపై కంటైన్మైంట్ జోన్ పరిధి 200 మీటర్ల వరకు ఉంటుంది.
10 పాజిటివ్ కేసుల కంటే ఎక్కువుంటే కంటైన్మైంట్ క్లస్టర్‌గా గుర్తించనున్నారు. అంతకన్నా తక్కువగా ఉంటే రహదారి లేదా వారు నివసిస్తున్న ప్రాంతాన్ని కట్టడి చేయనున్నారు. గుంటూరు, నరసరావుపేటల్లో కంటైన్మైంట్ జోన్ల పరిధిని కొత్తగా గుర్తించనున్నారు. ఇప్పటివరకు బఫర్ జోన్లలో ఉన్న వివిధ ప్రాంతాలు ఆంక్షల నుంచి బయటపడే అవకాశముంది.
సోమవారం జిల్లా నుంచి ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు పిడుగురాళ్ల, గుంటూరు, పెదకాకాని, నంబూరు, మంగళగిరి స్టేషన్లలో ఆగనున్నాయి. గుంటూరు- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారు. కరోనా కారణంగా భౌతికదూరం పాటించేలా గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద ప్రత్యేక క్యూలైన్లు, పాదముద్రలు ఏర్పాటు చేశారు.రైళ్లలో వచ్చిన వారిని రైల్వేస్టేషన్లలోనే థర్మల్ స్క్రీనింగ్ చేసి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి బోగీలో కనీసం ఐదుగురికి శాంపిల్స్ తీసి కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
ఇక.. జిల్లాలో సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరగనున్నాయి. జిల్లాలో 13 డిపోలుండగా నరసరావుపేట మినహా మిగతా 12 డిపోల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 28 సర్వీసుల వరకు కొన్ని ప్రాంతాల్లో బస్సులు నడుస్తుండగా సోమవారం నుంచి గుంటూరు సహా ఇతర డిపోల నుంచి 72 బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రయాణికులు భౌతికదూరం పాటించేటట్లు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపోల నుంచి డిపోలకు మాత్రమే సర్వీసులు నడుస్తాయని.. ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్లను విక్రయిస్తున్నామని ఆర్టీసీ ఆర్ఎం ఎస్టీపీ రాఘవకుమార్ చెప్పారు. జిల్లా పరిధిలోనే ప్రస్తుతం సర్వీసులు తిప్పుతున్నామన్నారు. అంతర్ జిల్లా సర్వీసులను నడపడం లేదని రాఘవకుమార్ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని వైద్యారోగ్య సిబ్బందికి జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.