ఏటా శ్రీపానకాలస్వామి ఆలయానికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు భక్తులు, పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. లాక్‌డౌన్‌తో జులై వరకు దర్శనానికి భక్తులను అనుమతించలేదు. ఆగస్టులో నిబంధనల ప్రకారం రెండు గంటల పాటే అనుమతించారు. ఆ తరువాత అనుమతించినా భక్తుల సంఖ్య సాధారణ స్థాయికి చేరలేదు. దీంతో దర్శనం టిక్కెట్లు, ఇతరత్రా ఆదాయం పెరగ లేదు.
గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.54,90,747 ఆదాయం రాగా, ఈఏడాది అదే నెలల్లో కేవలం రూ.5,77,318 ఆదాయం మాత్రమే వచ్చింది. పానకం విక్రయం ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. ఆదాయం బాగా తగ్గినందున ఒక దశలో దేవదాయ శాఖ నుంచి ఆలయ సిబ్బంది, అధికారుల వేతనాల్లో కోత పెట్టాలన్న ఆదేశాలు వచ్చాయి. తరువాత నిధులు అందుబాటును బట్టి పూర్తి చెల్లించవచ్చని ఉత్తర్వులు ఇవ్వడంతో సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల వనరుల ద్వారా ఆలయానికి రూ.3,82,06,865 ఆదాయం లభించింది. కొండపైన శ్రీపానకాలస్వామి ఆలయంలో పానకం విక్రయం ద్వారా రూ.1,26,10,000 ఆదాయం వచ్చింది.